logo

పింఛనుకూ నోచుకోని విధి వంచితులు

పిల్లలతో హాయిగా సాగి పోతున్న వారి కుటుంబాల్లో ప్రమాదాల రూపంలో విధి విసిరిన పంజాకు వారిద్దరూ మంచాలకే పరిమితమయ్యారు.

Published : 29 Nov 2022 03:29 IST

ప్రమాదాలతో మంచాలకే పరిమితం
మాడుగుల, న్యూస్‌టుడే

పిల్లలతో హాయిగా సాగి పోతున్న వారి కుటుంబాల్లో ప్రమాదాల రూపంలో విధి విసిరిన పంజాకు వారిద్దరూ మంచాలకే పరిమితమయ్యారు. బతుకు భారంగా నెట్టుకొస్తున్నారు ఆ పేదింటి యువకులు.

భార్య, కొడుకుతో రమేష్‌ (సత్యవరం)

ఎద్దు రమేష్‌ (35). సత్యవరం గ్రామం. డిగ్రీ చేసి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. పోతనపూడి సచివాలయంలో విద్యుత్తు ఇంజినీరింగ్‌ అసిస్టెంటుగా 2019 అక్టోబరులో ఎంపికయ్యాడు. 2020 ఫిబ్రవరిలో విధి నిర్వహణలో భాగంగా స్తంభం ఎక్కి అనుకోకుండా వచ్చిన విద్యుత్తు సరఫరాతో పైనుంచి పడిపోవడంతో నడుం విరిగిపోయింది. వెంటనే ఎంపీడీఓ పోలినాయుడు కేజీహెచ్‌కు తరలించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమై కాలం వెళ్లదీస్తున్నాడు. లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి రూ. 15 లక్షలు పరిహారం అందింది. విద్యుత్తు సంస్థ నుంచి సాయం రాలేదని రమేష్‌ వాపోయాడు. ప్రమాదానికి గురైన తరవాత దివ్యాంగ పింఛనుకు దరఖాస్తు చేసుకోవడంతో నాలుగు నెలల పాటు అందింది. ఆ తర్వాత పింఛను రద్దు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. దీంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. మందులు, ఇంటి ఖర్చులకు లేబర్‌ కమిషనర్‌ నుంచి అందిన ఆర్థిక సాయంతో నెట్టుకొస్తున్నారు. తనకు పింఛను మంజూరుతో పాటు తన భార్యకు కారుణ్య నియామకంలో ఉపాధి చూపించాలని రమేష్‌ కోరుతున్నాడు.


దాడి నర్సింగరావు (వీరనారాయణం)

దాడి నర్సింగరావు (32).
వీరనారాయణం. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 2017లో అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు  వెళ్తున్న ఘటనలో ఆటో బోల్తా పడి నడుం విరిగిపోయింది. విశాఖలో శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అప్పట్లో సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఈ సాయం ఇప్పించడంతో పాటు నెలకు రూ. పది వేల పింఛను అందించాలని కోరాడు. ఈ రెండు కుటుంబాలకు ఉపాధ్యాయుడు వి.ఎన్‌.బి.డి.వర్మ తోటివారితో కలిసి ఏడాది పాటు నిత్యావసర సరకులను అందించారు.


పింఛను ఇప్పిస్తా..

సచివాలయ ఉద్యోగి ఎద్దు రమేష్‌ పింఛను పునరుద్ధరణకు కృషి చేస్తా. ఇతను ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కాలేదు. ప్రొబేషన్‌ కాలం పూర్తి చేయని కారణంగా కారుణ్య నియామకాల్లో ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వలేం. నర్సింగరావు తెదేపా ప్రభుత్వ హయాంలోనే సీఎం ఆర్థిక సాయం పొందాల్సింది. ఇపుడేం చేయలేం. అతనికి పింఛను అందించే విషయాన్ని పరిశీలిస్తాం.

బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని