logo

షబ్నమ్‌ బాట.. అమ్మాయిల ఆట

మహిళల క్రికెట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఈ క్రీడలోకి వచ్చే బాలికల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Published : 29 Nov 2022 03:29 IST

క్రికెట్‌లో దూసుకెళ్తున్ననగర బాలికలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే:  మహిళల క్రికెట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఈ క్రీడలోకి వచ్చే బాలికల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్‌ ఫీజులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించడంతో వారిలో మరింత ఉత్సాహం వచ్చింది. విశాఖ క్రీడాకారిణి షబ్నమ్‌ అండర్‌-19 భారత మహిళల జట్టులో చోటు సంపాదించడంతో జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారిణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆమెలా తాము కూడా భారత జట్టుకు ఎంపిక కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.


వీడీసీఏ నుంచి ప్రోత్సాహం

మహిళల క్రికెట్‌కు జిల్లా క్రికెట్‌ సంఘం నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ-బి మైదానంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. నిత్యం సాధన చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది.  ఫలితంగా షబ్నమ్‌ లాంటి క్రీడాకారిణి భారత జట్టుకు ఎంపికైంది. అండర్‌-10, 12, 14, 16, 18లతో పాటు సీనియర్‌ గ్రూపుల్లోనూ జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నగరంలో సుమారు 100మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. అండర్‌-19 రాష్ట్ర జట్టులో సభ్యుల ప్రతిభను ఇక్కడ చూడొచ్చు.


క్షణంలో బెయిల్స్‌ పడేస్తుంది..

వై.హేమరోషిణి వికెట్‌ కీపర్‌గా రాణిస్తోంది. ఆమె చేతిలో బాలు ఉంటే ప్రత్యర్థి బ్యాటర్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వెళ్లే సాహసం చేయదంటే అతిశయోక్తి కాదు. కన్నుమూసి తెరిచేలోపు బెయిల్స్‌ను ఎగరేయడంలో రోషిణిది అందెవేసిన చేయి. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో రెండు స్టంపవుట్‌లకు తక్కువు కాకుండా చేసింది. మరో వైపు బ్యాటింగ్‌లోను అదరగొడుతూ జట్టుకు మంచి స్కోరు సాధించి పెడుతోంది. షబ్నమ్‌ ఎంపిక ఆమెలో మరింత ఉత్సాహం పెంచింది. మున్ముందు భారత జట్టుకు వికెట్‌ కీపర్‌గా సేవలందించాలనే పట్టుదలతో సాధన చేస్తోంది.


ఓపెనర్‌గా రాణిస్తూ..

పెందుర్తికి చెందిన కె.మహంతిశ్రీ ఓపెనర్‌ బ్యాటర్‌గా రాణిస్తోంది. జట్టుకు శుభారంభం అందించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. మంచి బ్యాటింగ్‌ శైలితో అద్భుతమైన షాట్లు కొడుతూ ప్రశంసలు అందుకుంటోంది. టీ-20 మ్యాచ్‌లు, ఛాలెంజర్‌ ట్రోఫీలోనూ సత్తా చాటింది. ఈ ఏడాది అక్టోబరులో చెన్నై, అహ్మదాబాద్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు అర్ధ శతకాలు సాధించింది. భవిష్యత్‌లో దేశం గర్వపడే బ్యాటర్‌గా పేరు తెచ్చుకోవాలని తపిస్తోంది.


బంతిని గిరగిరా తిప్పుతూ..

పీఎంపాలేనికి చెందిన విన్నీ సుజాన్‌ ఎడమచేతి స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను గడగడలాడిస్తోంది. బంతిని గిరగిరా తిప్పుతూ వికెట్లు పడగొడుతోంది. గత నెలలో చెన్నైలో జరిగిన అండర్‌-19 టీ-20 మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఆడి 11 వికెట్లు తీసింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయి మ్యాచ్‌ల్లో వంద వరకు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. షబ్నమ్‌ స్ఫూర్తితో భవిష్యత్‌లో భారత జట్టులో చోటు సంపాదించి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.


వికెట్లను వేటాడుతూ..

పీఎంపాలేనికి చెందిన బి.తన్మయ్‌ బౌలింగ్‌లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు అండర్‌-19 టీ-20 మ్యాచ్‌లు ఏడు ఆడి 12 వికెట్లు తీసింది. ఆమె ప్రతిభకు ఉన్నత స్థానం దక్కింది. ప్రస్తుత అండర్‌-19 రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తోంది. మంగళగిరిలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. అక్కడ బౌలింగ్‌పై మరింత దృష్టి కేంద్రీకరించి కోచ్‌ల శిక్షణలో కఠోరంగా శ్రమిస్తోంది. భవిష్యత్‌లో భారత జట్టులో చోటు సంపాదించి అత్యుత్తమ బౌలర్‌గా నిలవాలనే లక్ష్యంతో తన్మయ్‌ ముందుకు సాగుతోంది.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు