logo

ఇంటి దీపం ఆరిపోయింది..

విజయనగరం జిల్లాలోని మారుమాల గ్రామం నుంచి విశాఖ నగరానికి వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న సమయంలో రోడ్డు ప్రమాద రూపంలో ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది.

Published : 29 Nov 2022 03:29 IST

రోడ్డు ప్రమాదంలో క్యాటరింగ్‌ యజమాని దుర్మరణం

నరసింహులు (పాతచిత్రం)

ఆనందపురం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలోని మారుమాల గ్రామం నుంచి విశాఖ నగరానికి వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న సమయంలో రోడ్డు ప్రమాద రూపంలో ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల మండలం పెదబంటుబిల్లి గ్రామానికి చెందిన కలగర్ల నరసింహులు(55) వలస కూలీగా 24 ఏళ్ల కిందట విశాఖలోని పూర్ణమార్కెట్‌కు వచ్చారు. అప్పటి నుంచి రోజువారి కూలీగా చేస్తూ కొన్నేళ్ల కిందట స్వయంగా మణికంఠ క్యాటరింగ్‌ సెంటర్‌ ప్రారంభించి శుభకార్యాలకు ఆహారం అందించడం, వంటలు చేయడం మొదలుపెట్టారు. ఇదిలాఉండగా స్వగ్రామం పెదబంటుబిల్లిలో బంధువులు అయ్యప్పస్వామి పూజ నిర్వహించగా అక్కడ వంటలు చేయడానికి శనివారం రాత్రి నరసింహులు వెళ్లారు. పనులు ముగించుకొని సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై ఎస్‌.కె.నాగోరు మేరా(65) అనే వంట సహాయకునితో కలిసి తిరిగి బయలుదేరారు. ఆనందపురం 16వ జాతీయ రహదారి పెద్దిపాలెం వద్దకు వచ్చేసరికి పైవంతెన రక్షణ గోడను వీరి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తల భాగంలో తీవ్రంగా గాయపడిన నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మేరాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మేరాను 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు పేర్కొన్నారు. శవ పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడు నరసింహులుకు భార్య రత్నకుమారి, ముగ్గురు పిల్లలు వెంకటరమణ(21), మణికంఠ(19), ఇంటరు చదువుతున్న లక్ష్మీ ఉన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని