logo

విద్యాశాఖలో సర్దుపాట్లు

ఎలమంచిలి మండలంలో జంపపాలెం ఉన్నత పాఠశాలకు 3, 4, 5 తరగతుల నుంచి  22 మంది విద్యార్థులు వచ్చారు.

Updated : 02 Dec 2022 04:47 IST

సబ్జెక్ట్‌ టీచర్లకు భారీగా కొరత
పదో తరగతి బోధనపై ప్రభావం

ఈనాడు డిజిటల్‌, పాడేరు,న్యూస్‌టుడే, ఎలమంచిలి/పట్టణం: ఎలమంచిలి మండలంలో జంపపాలెం ఉన్నత పాఠశాలకు 3, 4, 5 తరగతుల నుంచి  22 మంది విద్యార్థులు వచ్చారు. ఈ పాఠశాలలో అదనంగా ఇంగ్లీష్‌, గణిత సహాయకుల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వారితోనే పాఠాలు బోధిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

పులపర్తి ఉన్నత పాఠశాలకు కృష్ణాపురం, పులపర్తి ప్రాథమిక పాఠశాలల నుంచి 55 మంది విద్యార్థులు వచ్చారు. ఈ పాఠశాలకు ముగ్గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఇక్కడకు వచ్చి బోధిస్తున్నారు. ఈ పాఠశాలకు అదనంగా ఆంగ్లం, గణితం, తెలుగు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలలను సబ్జెక్ట్‌ టీచర్ల కొరత వేధిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది లేకపోవడం.. ఉన్నవారితోనే అదనపు క్లాసులు చెప్పించడంతో బోధనలో నాణ్యత కొరవడుతోందని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి. దీనికి తోడు 262 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప యూపీ, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. దీన్ని అధిగమించేందుకు మిగులు ఉపాధ్యాయులను గుర్తించి వారిని అవసరమైన చోట సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్జీటీలకు పదోన్నతులిచ్చారు.. కొన్ని సబ్జెక్ట్‌ల్లో మిగులు ఉపాధ్యాయులను ఇతర సబ్జెక్ట్‌లోకి మార్చారు. బదిలీలు జరిగిన తర్వాత సర్దుబాటు చేద్దామని ఇప్పటివరకు ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో బదిలీలు జరిగే అవకాశం లేకపోవడంతో సర్దుబాటుతో సరిపెట్టబోతున్నారు.

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల కొరత లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సర్దుబాటు ప్రక్రియ చేపడితే బాగుండేది..ఏటా సగం విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు ఈ సర్దుబాటు జరగడం లేదు. దీంతో సకాలంలో సిలబస్‌ పూర్తి చేయలేకపోతున్నారు. ఆ ప్రభావం పరీక్షల ఫలితాలపైనా పడుతోంది.

ఇంకా కొరతే : ఉమ్మడి జిల్లాలో 4212 పాఠశాలలున్నాయి. వీటిలో 525 ఉన్నత పాఠశాలలున్నాయి. గత మూడేళ్లలో 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఆయా పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు, సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటికి అదనంగా విలీన పాఠశాలలు తోడయ్యాయి. వాటన్నింట్లో సబ్జెక్ట్‌ టీచర్లను సర్దుబాటు చేయాలంటే 531 మంది అవసరం అవుతారని గుర్తించారు.


పదోన్నతులు, సబ్జెక్ట్‌ మార్పిడి ద్వారా 318 మందిని సర్దుబాటు చేస్తున్నారు. ఇంకా 213 మంది ఉపాధ్యాయుల కొరత కనిపిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీలోనే ఎక్కువ ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడానికి అవకాశాలు కనిపించకపోవడంతో ఆయా పాఠ్యాంశాల బోధనపై తీవ్ర ప్రభావమే పడనుంది.


ఏటా ఇదేతీరు..

గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత తగ్గిపోవడానికి ఉపాధ్యాయుల కొరత కూడా ఒక కారణమేనని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్‌ టీచర్లతో బోధిస్తామని చెప్పినా చాలా పాఠశాలల్లో ఎస్జీటీలతోనే సరిపెట్టేస్తున్నారు. ఈ విషయమై డీఈవో లింగేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని, బోధనకు ఇబ్బంది లేకుండా మిగులు ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు పంపిస్తున్నామన్నారు. విలీన విద్యార్థులకు సబ్జెక్ట్‌ టీచర్లతోనే బోధిస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని