logo

విషాదమయం!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ మేట్రిన్‌, ఆమె భర్త గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 02 Dec 2022 06:49 IST

ఉమ్మడి విశాఖ జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు విషాదం నింపాయి. వీటిపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


మంచంపై విగతజీవులై!
మేట్రిన్‌ దంపతుల అనుమానాస్పద మృతి

మృతులు సుమన్‌,  రాధ (పాత చిత్రం)

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల డిప్యూటీ మేట్రిన్‌, ఆమె భర్త గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డుంబ్రిగుడ మండలం అరకు గ్రామానికి చెందిన గుజ్జెలి రాధ (32) అరకులోయ మండలం కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలిక వసతిగృహంలో డిప్యూటీ మేట్రిన్‌గా పనిచేస్తున్నారు. ఈమె తన భర్త నన్ని సుమన్‌ (34)తో కలిసి పాఠశాల ఆవరణలోని సిబ్బంది నివాస గృహంలో  ఉంటున్నారు. సుమన్‌ స్వగ్రామం హుకుంపేట మండలం బూర్జ. వీరికి కుమార్తె బ్లెస్సీ జాయ్‌,  కుమారులు బేతేలు జాషువా, ఆకర్ష్‌ పాల్‌  ఉన్నారు. వీరు ముగ్గురు విశాఖలో చదువుకుంటున్నారు. రాధ భర్త కూడా విశాఖ నుంచి బుధవారం రాత్రే కొత్తబల్లుగుడ వచ్చారు. గురువారం ఉదయం పాఠశాల సమయానికి రాధ కనిపించకపోవడం, ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సంతోష్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నివాసంలోని బెడ్‌రూంలో మంచంపై భార్యాభర్తలు విగతజీవులుగా కనిపించారు. తొలుత వీరిది ఆత్మహత్యగా అంతా భావించారు. అయితే రాధ మెడ వాచి ఉండటం, కళ్లు, నోరు తెరిచి ఉండగా, భర్త సుమన్‌ వాంతులు చేసుకుని విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. అల్లుడే తమ కుమార్తె రాధను చంపి, ఆ తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ఎదుట రాధ తండ్రి మాణిక్యం అనుమానం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా భార్యాభర్తల మధ్య విభేదాలున్నాయని, ముగ్గురు పిల్లలు ఉండటంతో సర్దుకుపోతారని జోక్యం చేసుకోలేదని మాణిక్యం ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం పరిశీలించారు. మృతురాలి తండ్రి, బంధువుల వాంగ్మూలం తీసుకుని అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.


జాషువానగర్‌లో ఆటోడ్రైవర్‌..

మృతుడు నాగరాజు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: రెడ్డి కంచరపాలెం జాషువానగర్‌ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాషువానగర్‌ ప్రాంతానికి చెందిన కొంత శాంతికుమారి భర్త నాగరాజు(45) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గత ఆరేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. అతడి కాలుకి గాయం అవ్వడంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి, భార్య శాంతికుమారికి సమాచారం ఇచ్చారు. ఆమె కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులను, కుటుంబ సభ్యులను విచారించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయకుమార్‌ తెలిపారు.


ఊర్వశి కూడలి వద్ద వాచ్‌మెన్‌...

గౌరీశంకర్‌ (పాత చిత్రం)

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : ప్రభుత్వ మద్యం దుకాణానికి కూత వేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశవానిపాలెం ప్రాంతానికి చెందిన బిల్లా గౌరీశంకర్‌(50) ఈ ప్రాంతంలోని నేవీ క్వార్టర్స్‌ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న అతడు గురువారం ఉదయం పనికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి స్థానిక మహిళ ఒకరు గౌరీశంకర్‌ కుమారుడు రాజు వద్దకు వచ్చి, మీ నాన్న ఊర్వశికూడలి వద్ద వైన్‌షాపు సమీపంలో పడిపోయి ఉన్నాడని చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి అతడు వెళ్లి పరిశీలించగా తలకు గాయమై అప్పటికే గౌరీశంకర్‌ మృతి చెంది ఉన్నాడు. దీనిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెళ్లి పరిశీలించారు. మద్యం మత్తులో జారి పడడంతో తలకు తీవ్ర గాయమై గౌరీశంకర్‌ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచరపాలెం సీఐ విజయకుమార్‌ తెలిపారు.


మనస్తాపంతో విద్యార్థి ...

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : మనస్థాపంతో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన మూడో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏయూ క్వార్టర్స్‌లో నివాసముంటున్న పి.మాధవ్‌(25) ఏయూలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లి ఆచార్య రత్నం ఏయూలోనే డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. మాధవ్‌ గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లి ఉన్న తండ్రి వచ్చే చూసేసరికి ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. మూడేళ్ల కిందట మాధవ్‌ సోదరి కూడా ఇలాగే ఉరివేసుకొని చనిపోయింది. కవలలైన మాధవ్‌ సోదరుడికి ఇటీవల ఉద్యోగం వచ్చింది. తల్లి ఆచార్య రత్నంకు కూడా ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. సోదరి చనిపోవడం, సోదరుడికి ఉద్యోగం వచ్చి తనకు రాకపోవడం, తల్లి అనారోగ్యం.. ఈ కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి దిల్లేశ్వరరావు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. రాము సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇతర కారణాలు కూడా ఉన్నాయా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.


వ్యాపారవేత్త త్రిలోక్‌చంద్‌ హిరావత్‌ మృతి

త్రిలోక్‌చంద్‌ హిరావత్‌ (దాచిన చిత్రం)

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖలో హిరావత్‌ వస్త్ర వ్యాపార సంస్థల వ్యవస్థాపకులు త్రిలోక్‌చంద్‌ హిరావత్‌(93) గురువారం ఉదయం మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ వస్త్రవ్యాపారం ప్రారంభించారు. ఆయన వస్త్రవ్యాపారుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. సిరిపురం దరి ఆయన నివాసం వద్ద మృతదేహానికి వ్యాపారవేత్తలు మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్‌, ప్రముఖ వైద్యులు ఆదినారాయణ. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌లు అంజలి ఘటించి, నివాళులు అర్పించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు