logo

అడ్డులేని కల్తీ.. లెక్కల్లో కక్కుర్తి

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇంటి దొంగలు ఎక్కువ అవుతున్నారు. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం పొరుగుసేవల విధానంలో సిబ్బందిని నియమించి అమ్మకాలు సాగిస్తోంది.

Updated : 04 Dec 2022 06:34 IST

మద్యం షాపుల్లో మాయాజాలం
ఇంటి దొంగలను పట్టుకునేందుకు నిఘా

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇంటి దొంగలు ఎక్కువ అవుతున్నారు. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం పొరుగుసేవల విధానంలో సిబ్బందిని నియమించి అమ్మకాలు సాగిస్తోంది. రోజువారీ వచ్చే ఆదాయాన్ని సూపర్‌వైజర్లు మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లింపుల్లో జాప్యం చేయడం, సరకు అమ్మినా.. అమ్మనట్లుగా లెక్కల్లో చూపడం చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మరింత నిఘా పెంచాలని  ఆదేశాలు అందాయి. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు యోచిస్తున్నారు.

గతంలో ప్రైవేటుగా మద్యం దుకాణాలు నిర్వహించే సమయంలో కల్తీ ఘటనలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 147 మద్యం దుకాణాలు, 9 బార్లు ఉన్నాయి. బార్లు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుండగా, మద్యం దుకాణాలను మాత్రం సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దుకాణాల్లో విధులు నిర్వహించేది ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి కల్తీ ఉండదని అంతా అనుకున్నారు. అందుకే అబ్కారీ అధికారులు ఇంతవరకు వీటిపై పెద్దగా నిఘా పెట్టలేదు. కాని ఇటీవల ఇక్కడ కల్తీ బాగోతాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో నిఘాను మరింత పెంచారు. నవంబరులో అచ్యుతాపురంలోని దుకాణంలో బాటిల్‌ సీల్‌ తీసి నీళ్లు నింపి విక్రయించారు. దీన్ని గుర్తించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. రాంబిల్లిలోనూ ఇలాగే కల్తీ చేయడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.

అటు.. ఇటు బార్లా తెరిచారు

అనకాపల్లిలోని ఓ బార్‌లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధన ప్రకారం బార్‌కి ఒకవైపు మాత్రమే మార్గం ఏర్పాటు చేయాలి. నెహ్రూచౌక్‌లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు దుకాణం పక్కగా మరో షెల్టర్‌ ఏర్పాటుచేసి ఇక్కడ బోర్డు పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలా రెండు మార్గాల్లో మందుబాబులకు నచ్చిన మద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారుల నుంచి స్పందన కొరవడింది.

దుకాణాల వద్ద సీసీ కెమెరాలు

ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు బార్లపై నిఘా మరింత పెంచుతాం. కల్తీకి పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టి విధుల్లో నుంచి తొలగించాం. వారంలో జిల్లాలో అన్ని దుకాణాలను పరిశీలిస్తున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం.  ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని ఆదేశాలు వచ్చాయి. దీన్ని త్వరలోనే అమలు చేస్తాం.
ఎన్‌.వి.రమణ. మధ్య నిషేధ,  అబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌

జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి రోజుకు రూ. 2.5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. బార్ల నుంచి నెలకు రూ.2.70 కోట్లు వస్తుంది. ఆదాయాన్ని పెంచేలా దుకాణాల్లో డిమాండ్‌ అధికంగా ఉన్న బ్రాండ్లను పెడుతున్నారు.  ఇటీవల కాలంలో రాత్రి 8 గంటల వరకు ఉండే సమయాన్ని మరో గంట పెంచారు. బార్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు ఆహారం తింటున్నట్లుగా చూపి అమ్మకాలు చేస్తున్నారు. నిఘా కట్టుదిట్టం చేయడంతోపాటు వారికిచ్చే వేతనాలనూ నవంబరు నుంచి పెంచారు.

అన్ని దుకాణాలను పరిశీలించాల్సిందే

ఎంఆర్‌పీ కంటే పెంచి అమ్ముతున్నా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. దీనిని ఉద్యోగులు అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లిలో ఇలా అమ్ముతున్న వారిపై కేసులు పెట్టి సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించారు. పర్యవేక్షక సిబ్బంది తక్కువమందున్నా ప్రతి వారం అన్ని దుకాణాలను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు

ఎక్సైజ్‌ కార్యాలయ పరిధిలో ఉన్న 147 మద్యం దుకాణాలు, 9 బార్లను పరిశీలించడానికి ఒక రిటైల్‌ అవుట్‌లెట్‌ మానిటరింగ్‌  అధికారి (సీఐ), ముగ్గురు సహాయ అధికారులు (ఎస్సైలు), 15 మంది తనిఖీ అధికారులు (కానిస్టేబుళ్లు) ఉన్నారు. వీరంతా అనకాపల్లి జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు పరిశీలిస్తుండాలి. సిబ్బంది తక్కువగా ఉండడంతో నిఘా తూతూమంత్రంగా సాగుతోంది. ఇది దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి కలిసొస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటుచేసి ఏ ప్రయోజనం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని