logo

ధాన్యం కొనేదెప్పుడు సారూ!

పెదబొడ్డేపల్లికి చెందిన రైతు అప్పారావు రెండు రోజుల క్రితం ధాన్యం నూర్చారు. అవసరమైన గోనె సంచుల కోసం రైతుభరోసా కేంద్రానికి వచ్చారు

Published : 04 Dec 2022 06:46 IST

యాప్‌ వచ్చాకేఅంటున్న సిబ్బంది
ఆర్బీకేలకు చేరని గోనె సంచులు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

పెదబొడ్డేపల్లికి చెందిన రైతు అప్పారావు రెండు రోజుల క్రితం ధాన్యం నూర్చారు. అవసరమైన గోనె సంచుల కోసం రైతుభరోసా కేంద్రానికి వచ్చారు. సంచులు ఇంకా జిల్లాకేంద్రం నుంచి రాలేదని అక్కడి సిబ్బంది స్పష్టంచేశారు. ఏవో తంటాలు పడి నూర్చిన ధాన్యాన్ని బస్తాలకెత్తుకుంటాం... కల్లానికి ఎప్పుడొచ్చి నాణ్యత పరిశీలిస్తారని ఆ రైతు ప్రశ్నించారు. యాప్‌ అందుబాటులోకి రాలేదు. ఆదొచ్చే దాకా కొనుగోళ్లకు వీలుకాదనడంతో... చేసేది లేక వ్యయ, ప్రయాసల కోర్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చారు
..యాప్‌ ఎప్పుడు తెరుస్తారా?, ఇంట్లోని నిల్వలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని రైతు ఎదురు చూస్తున్నారు.
...అప్పారావు ఒక్కరే కాదు... ధాన్యం నూర్పిళ్లు చేసి రైతులందరిదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే కొన్ని రకాలు కోతకొచ్చాయి. చాలాచోట్ల కోతలు పూర్తయ్యి కుప్పలేసి నిల్వ చేసుకుంటున్నారు. కొందరు నూర్చేసి అమ్మకాలకు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నాతవరం, దేవరాపల్లి, మాడుగుల మండలాలకు మాత్రమే లక్ష గోనె సంచులను జిల్లా కేంద్రం నుంచి పంపారు. మిగిలిన మండలాలకు పంపాల్సి ఉంది. ఈనెల మూడో తేదీ నుంచి కొనుగోళ్లు ఉంటాయన్న సమాచారంతో చాలామంది రైతులు శనివారం కొనుగోలు కేంద్రాలకు వచ్చారు. యాప్‌ అందుబాటులోకి రాలేదని, ఎప్పుడోస్తుందో సమాచారం లేదని సిబ్బంది చెప్పడంతో తమ ఫోన్‌ నంబర్లు ఇచ్చి నిరాశతో తిరుగుముఖం పట్టారు.

నిబంధనలు ఇవీ...

* ఈ-క్రాప్‌ నమోదు చేసుకుని ఈకేవైసీ పూర్తయిన రైతులు ధాన్యం విక్రయాలకు సిద్ధంగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. వ్యర్థ పదార్థాలు, రంగు మారిన, కుంచించుకుపోయిన, తక్కువశ్రేణి గింజలు, తేమ తదితర నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటేనే కొనుగోలు చేస్తారు.
* రైతులు ధాన్యం విక్రయించిన తరువాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. 21 రోజుల్లో రైతు ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
* రైతు భరోసా కేంద్రం నిర్దేశించిన నాణ్యత ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రభుత్వమే సంచులివ్వాలి

ఐదెకరాల్లో వరి వేశా. రెండు ఎకరాల పంట నూర్చి ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకున్నాం. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పాడు చేస్తాయి. పంట అన్నిచోట్లా కోతకువచ్చింది. ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని రైతులంతా చూస్తున్నారు. వెంటనే గోనె సంచులు అందుబాటులో ఉంచాలి. మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించే ధర తక్కువగా ఉంటోంది. ప్రభుత్వమే సరఫరా చేస్తే రైతుకు మేలు.
మతల అప్పారావు, రైతు, పెదబొడ్డేపల్లి

  ఎనిమిది నుంచి కొనుగోళ్లు

ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. జిల్లాలో 32వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నాం. ఇప్పటికే మూడు మండలాలకు గోనె సంచులు పంపాం. మిగతా మండలాలకు పంపిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడే విధంగా ధాన్యాన్ని మెరుగుపరిచి సిద్ధం చేసుకోవాలి. కనీస మద్దతు ధర వంద కేజీల ఏ గ్రేడ్‌ రకాలకు రూ.2060, సాధారణ రకాలకు రూ.2040 చెల్లిస్తారు. విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్‌ఫ్రీ 1902, 155251 నంబర్లను సంప్రదించొచ్చు.

 ఎం.శ్రీలత, పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని