logo

ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో... అనర్హులు?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

Updated : 04 Dec 2022 05:49 IST

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సీపీఎం నేతలు ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు ఫిర్యాదు చేశారు. మరో పక్క ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇదే సమయంలో పేర్లు నమోదు చేసుకోకుండా ఉండిపోయిన అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంది.

క్షేత్రస్థాయిలో చురుగ్గా పరిశీలన

* 2019కు ముందు డిగ్రీ ఉతీర్ణులైన వారు మాత్రమే ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుకు జత చేసిన డిగ్రీ ధ్రువపత్రాలపై గజిటెడ్‌ అధికారి సంతకం చేసిన వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిర్దేశిత నిబంధన ఉల్లంఘించారని, 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారి పేర్లను సైతం ఓటరు జాబితాలో చేర్చారని ఫిర్యాదులు వచ్చాయి.
* ఉత్తరాంధ్ర పరిధిలో ఆరు జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఓటరు జాబితాల తయారీ కోసం నియమితులైన ఈఆర్‌ఓ (ఎలక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారి), ఏఈఆర్‌ఓల (అదనపు ఎలక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారి) ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాల వారీ ఓటరు జాబితాల పరిశీలన చేపట్టారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించిందీ లేనిదీ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా ఓటర్లపై అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. డబుల్‌ ఎంట్రీలను తొలగిస్తున్నారు. అభ్యంతరాలపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పిదాలు ఉంటే ఆయా పేర్లను తొలగిస్తున్నారు.

పునః నమోదుకు 11వేల దరఖాస్తులు

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉత్తరాంధ్రలో 2,43,903 మంది పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మళ్లీ పేర్ల నమోదుకు ఇంత వరకు 11వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటి విచారణ కూడా చేపట్టారు.
* అభ్యంతరాలతో పాటు సుమోటోగా కూడా ముసాయిదా ఓటరు జాబితాలపై విచారణ చేస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి తెలిపారు. తమ దృష్టికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక వేళ జాబితాల్లో ఎక్కడైనా తప్పిదాలు ఉంటే అభ్యంతరం తెలుపుతూ పౌరులు దరఖాస్తు చేయవచ్చునని సూచించారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా జాబితాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు.


ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు ఇలా..జిల్లా ఓటర్లు
శ్రీకాకుళం 46,119
విజయనగరం 54,466
పార్వతీపురం 17,052
అల్లూరిజిల్లా 10,200
విశాఖపట్నం 80,105
అనకాపల్లి 35,961

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని