logo

పెళ్లి మండపంలో... ప్రియురాలి హడావుడి

నూతన వధూవరులకు వివాహం జరుగుతుండగా... వరుడి ప్రియురాలు అక్కడకు చేరుకుని ఆందోళన చేసిన ఘటన శనివారం నాతయ్యపాలెంలో చోటు చేసుకుంది.

Published : 04 Dec 2022 05:28 IST

వరుడిని అరెస్టు చేయాలని ఆందోళన

కుటుంబీకులతో మాట్లాడుతున్న సీఐ భాస్కరరావు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : నూతన వధూవరులకు వివాహం జరుగుతుండగా... వరుడి ప్రియురాలు అక్కడకు చేరుకుని ఆందోళన చేసిన ఘటన శనివారం నాతయ్యపాలెంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... నగరంలోని కేఆర్‌ఎంకాలనీలో అద్దింట్లో నివాసం ఉంటున్న పార్వతీపురానికి చెందిన యువతి(26), ఆటోనగర్‌కు చెందిన భగత్‌ (32) వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిగా పని చేస్తూ స్నేహితులయ్యారు. కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారడంతో తరచూ కలుస్తుండేవారు. ఈ క్రమంలో భగత్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బాధితురాలు ఈ ఏడాది మే నెలలో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు తీర్పు మేరకు సుమారు 3 నెలలు జైలు శిక్ష అనుభవించిన భగత్‌ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు నడుస్తుండగా శనివారం మరో యువతి(25)తో వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న ప్రియురాలు డయల్‌ 100కు ఫిర్యాదు చేసి, తన బంధువులతో కలిసి నాతయ్యపాలెంలో మండపం వద్ద చేరుకుని నిరసన తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...బాధితురాలు, ఆమె కుటుంబీకులతో మాట్లాడారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము పెళ్లిని ఆపలేమని, న్యాయపరంగా కోర్టులో పోరాడాలని సూచించారు. ఇదే అంశంపై నూతన వధువు, వారి కుటుంబీకులతో పోలీసులు మాట్లాడగా... అన్ని విషయాలు ముందుగానే తమకు తెలుసునని, వధువు ఇష్ట ప్రకారమే వివాహం చేస్తున్నామన్నారు. పాత కేసుకి సంబంధించి కోర్టు తీర్పు ఎలా వస్తే అలా నడుచుకుంటామని వారు బదులిచ్చారు. అయితే రెండు రోజుల కిందటే వివాహం చేసుకున్నామని, ఇప్పుడు కేవలం రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకున్నామని భగత్‌ తెలిపాడు. పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడుతుండగానే... వివాహం జరిగిపోయిందని బాధితురాలు ఆరోపించారు. ఇంతలో బాధితురాలి సోదరుడు పెట్రోల్‌సీసా తీసుకురావడంతో పోలీసులు సీసాను స్వాధీనం చేసుకుని, అతడిని మందలించారు. చివరకు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉన్నందున అందరూ మండపం ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని సీఐ భాస్కరరావు సూచించారు. అందరూ బయటకు వచ్చేయడంతో వివాదం తాత్కాలికంగా సద్ధుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని