logo

మురుగునీటి శుద్ధికి మరో మూడేళ్లు..!

విశాఖ నగర శివారు పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జీవీఎస్‌సీసీఎల్‌) చేపట్టిన యూజీడీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గడువు సమీపిస్తోంది.

Published : 06 Dec 2022 03:26 IST

ఎస్టీపీ నిర్మాణంలో జాప్యం
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

నరవ వద్ద నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం

విశాఖ నగర శివారు పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జీవీఎస్‌సీసీఎల్‌) చేపట్టిన యూజీడీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గడువు సమీపిస్తోంది. పెందురి ప్రాజెక్టుకు మరో 24 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇళ్ల వరకు వడివడిగా పైపులైన్లు వేస్తున్నారు. అయితే నరవ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇళ్లకు ఇప్పుడిప్పుడే కనెక్షన్లు ఇచ్చే దాఖలాలు కనిపించడం లేదు. యూజీడీ (భూగర్భ మురుగునీటి వ్యవస్థ) పైపులైన్లు నరవలోని ఎస్టీపీకి చేరాల్సి ఉంది. ఈ పైపులైన్లు రెండు ప్రాంతాలలో రైల్వేలైన్లు దాటాల్సి ఉండగా ఆయా పనులు ప్రారంభమే కాలేదు.

* జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం) నిధులతో నరవలో 105 ఎంఎల్‌డీల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం ప్రతిపాదించారు. 75 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఒక ఎస్టీపీ అందుబాటులోకి వచ్చింది. 75 ఎంఎల్‌డీ సామర్థ్యం గల మరో ఎస్టీపీ నిర్మాణంతోపాటు టెర్షరి ట్రీట్‌మెంట్‌(మూడు దశల శుద్ధి) చేసే యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంది. ఆయా పనులు జరగాలంటే మరో రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయి.

రెండు ప్యాకేజీలుగా ప్రాజెక్టు

* గాజువాక పరిసరాలు, మల్కాపురం, పెందుర్తి ప్రాంతాల్లో రూ.905కోట్ల వ్యయంతో యూజీడీ నిర్మాణం చేపట్టారు. వ్యయ భారమంతా జీవీఎంసీ భరించి మురుగు నీటిని శుద్ధి చేయగా వచ్చే నీటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్టీల్‌ప్లాంటు, హెచ్‌పీసీఎల్‌తో జీవీఎస్‌సీసీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.309.94కోట్లతో పెందుర్తి ప్రాంతంలో.., రెండో ప్యాకేజీగా రూ. 411 కోట్ల వ్యయంతో గాజువాకలో యూజీడీ నిర్మాణం చేపట్టారు. పెందుర్తిలో పనులు చురుగ్గానే జరుగుతున్నా, గాజువాకలో గుత్తేదారు సంస్థకు నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
* పెందుర్తిలో 15వేల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 6వేల ఇళ్ల వరకు పైపులైన్లు వేశారు. గాజువాకలో 45 వేల కనెక్షన్లకు గాను 5056 ఇళ్ల వరకు పైపులైను వేయగలిగారు. గాజువాక ప్యాకేజీకి గడువు వచ్చే ఏడాది జులై వరకు ఉంటుందని ఇంజినీరింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. రెండు ప్యాకేజీలు పూర్తయి, నీటిని శుద్ధి చేసి విక్రయించడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని