logo

ఎట్టకేలకు హద్దుల స్పష్టతకు సర్వే

సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) భూముల్లోని 3,600 గజాల సాంఘిక సంక్షేమశాఖ స్థలంలో సర్వే నిమిత్తం సోమవారం పొదలు, చెట్లు తొలగించారు.

Published : 06 Dec 2022 03:26 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సీబీసీఎన్‌సీ (ద కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) భూముల్లోని 3,600 గజాల సాంఘిక సంక్షేమశాఖ స్థలంలో సర్వే నిమిత్తం సోమవారం పొదలు, చెట్లు తొలగించారు. సర్వే నెంబరు 75/4లో సాంఘిక సంక్షేమశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఈ స్థలాన్ని మంజూరు చేసింది. జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఈ భూముల్లో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన స్థలం ఉందని, పరిరక్షించాలని ఇటీవల కలెక్టర్‌ను కోరగా విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్‌ ఆదేశాలతో ఈ భూమి వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. సోమవారం ఆ స్థలంతోపాటు, సీబీసీఎన్‌సీ స్థలంలో ఉన్న పొదలు, చెట్లు తొలగించారు. సర్వే చేసి తమ స్థలానికి హద్దులు నిర్ణయిస్తామని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు రమణమూర్తి తెలిపారు. బీ సాంఘిక సంక్షేమశాఖకు చెందిన స్థలం పక్కన, వెనుక కొన్ని నిర్మాణాలు వెలిశాయి. దీంతో సీబీసీఎన్‌సీ యాజమాన్యం మొత్తం భూమిలో మధ్యనున్న స్థలం కూడా తమదని చెబుతోంది. యాజమాన్య హక్కుల కోసం 2009లో వేసిన కేసులో ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖకు చెందిన స్థలం కూడా తమదిగా దస్త్రాలు చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా దస్త్రాలను జీవీఎంసీకి చేసిన ప్లాను దరఖాస్తులో పొందుపరచడంతోపాటు, నిర్మాణాలకు అనుమతివ్వడానికి అనుగుణంగా 10శాతం భూమిని మార్టిగేజ్‌ చేశారు. అందులోనూ సర్వే నెంబరు 75/4లోని స్థలం ఉందనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపే వరకు ప్లాను మంజూరు చేయకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇప్పటికే ఆగమేఘాలపై జారీ చేసిన టీడీఆర్‌ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని