logo

కంచేసి.. పంచేసుకున్నారు!!

ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికాకుండా చూడాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో అంతులేని ఉదాసీనత చూపుతున్నారు.

Published : 06 Dec 2022 03:26 IST

భూములు ఆక్రమించినా పట్టించుకోని యంత్రాంగం
ఇదేం మాయో...అధికారులకెంత దయో!!
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పరవాడ

వివాదాస్పద భూముల చుట్టూ ఏర్పాటు చేసిన కంచె

ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికాకుండా చూడాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో అంతులేని ఉదాసీనత చూపుతున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన సర్కారు భూములు ఆక్రమణదారుల గుప్పిట నుంచి బయటపడలేకపోతున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో వందల కోట్ల విలువ చేసే 50 ఎకరాల పైగా ప్రభుత్వ భూములను కొందరు అడ్డగోలుగా దక్కించుకున్నారని తెలుస్తున్నా కనీస చర్యలు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.

పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని ప్రభుత్వ భూములను స్థానికుడొకరు పక్కా ప్రణాళికతో తన కుటుంబీకుల పరం చేసుకున్నాడు. వివరాలు పరిశీలిస్తే వారి పేర్లే ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. అంతలా వ్యూహాత్మకంగా రికార్డుల్లో మాయాజాలం జరిగింది. కొన్ని భూములను బినామీ పేర్లతో దక్కించుకున్నాడు. వాటిలో కొబ్బరి, అరటి తోటలు సాగు చేస్తున్నాడు. కొన్ని భూములు లీజుకు ఇచ్చాడు. ఈ భూముల చుట్టూ సిమెంట్‌ స్తంభాలతో, ఇనుప తీగలతో రక్షణ కంచె ఏర్పాటు చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన కొందరు ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ మూడేళ్ల క్రితమే సిట్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో  క్షేత్రస్థాయిలో పరిశీలించి 16 ఎకరాలపై ఎలాంటి వ్యవహారాలు జరగకుండా వెబ్‌ల్యాండ్‌లో హోల్డ్‌లో పెట్టారు. ఆ తర్వాత స్పందనలో ఫిర్యాదుల మేరకు స్థానిక తహసిల్దార్‌తో విచారణ చేయించారు. సుమారు 44 ఎకరాల ప్రభుత్వ భూములు ప్రస్తుత అనుభవదారులకు ఎలా దఖలుపడ్డాయో సరైన ఆధారాలు లేవు. దీంతో వారికి జారీ చేసిన పట్టాలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని విచారణాధికారి సూచించారు.

అయినా రెవెన్యూ అధికారులు ఆ భూముల వైపే చూడటం లేదు. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లే కారణమని సమాచారం.

పరిరక్షణపై కాలయాపన

హోల్డ్‌లో పెట్టిన భూములపైనా అధికారులు వాస్తవాలు వెల్లడించటం లేదు. అక్రమార్కులు అడ్డగోలుగా తమ పరం చేసుకున్నారని విచారణలో తేలిన వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవటానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా చోట్ల ఇవి ప్రభుత్వ భూములని బోర్డులైనా పెట్టాలి. అధికారులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు. మరోసారి విచారణ చేయిస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై తహసిల్దారు ప్రకాశరావు వద్ద ప్రస్తావించగా నిధులు సమకూర్చుకొని ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టే చర్యలు తీసుకుంటామని వివరించారు.

పేర్లలో తిరకాసు

* ఒక సర్వే నంబరులో మూడు ఎకరాలకు సంబంధించి ఫసలీలో ఒక పేరు, డీఫాం రిజిస్టర్‌లో మరో పేరు, వన్‌బీలో ఇంకో పేరు ఉంది.
* 4.60 ఎకరాలకు సంబంధించి ఫసలీలో ఎవరి పేరు లేకున్నా...డీఫాం, వన్‌బీ రికార్డుల్లో మాత్రం రామారావు పేరుంది.
* 2.35 ఎకరాలకు ఫసలీ, డీఫాం దస్త్రాల్లో ఒకపేరుంటే...వన్‌బీ లో మాత్రం ఇంకో పేరు కనిపిస్తోంది.
* ఒక సర్వే నంబరులో మూలయ్య పేరిట 2 ఎకరాలు, మహాలక్ష్మి పేరిట 1.78 ఎకరాలు ఫసలీలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మాత్రం మూలయ్య పేరిటే మొత్తం భూమి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని