logo

మైమరపించే వసతులు సిద్ధం

ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. నగరంలో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య వారాంతాల్లో భారీగా ఉంటోంది.

Updated : 06 Dec 2022 05:27 IST

పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది
అందుబాటులోకి లంబసింగి రిసార్టు
ఏపీటీడీసీ డీవీఎం హరిత

ఈనాడు, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. నగరంలో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య వారాంతాల్లో భారీగా ఉంటోంది. కొవిడ్‌ తరువాత పరిస్థితులు చక్కబడటంతో ప్రస్తుత సీజన్‌లో దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)  తగిన ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ నుంచి పర్యాటక ప్యాకేజీలను పెంపొందించి... అరకు, అనంతగిరి, టైడా, లంబసింగిలో సందర్శకులను మైమరపించే వసతులు సిద్ధం చేసినట్లు డివిజనల్‌ మేనేజర్‌ (డీవీఎం) హరిత పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నం డీవీఎంగా బాధ్యతలు చేపట్టిన హరిత...ఈ సీజన్‌ నిమిత్తం చేపట్టిన చర్యలను వివరించారు.

* ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే పర్యాటకులు అధికం. వీరిలోనూ బెంగాల్‌ నుంచి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువ. ఇప్పటికే కోల్‌కతాలో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. దాని ద్వారా ప్యాకేజీలు నిర్వహిస్తున్నాం. పర్యాటక హోటళ్లలో వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించాం.
* అసంపూర్తిగా ఉండిపోయిన లంబసింగి హిల్‌ రిసార్టును అందుబాటులోకి తీసుకొచ్చాం. పర్యాటకులకు నచ్చేలా అత్యాధునిక వసతులతో గదులు, రెస్టారెంట్‌ నిర్మాణం పూర్తయింది. గతంలో ఉన్న నాలుగు గదులతో పాటు కొత్తగా 8 గదుల అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు కొద్ది రోజుల్లో పూర్తవుతాయి. ప్రకృతి
అందాలను,  మంచు కురిసే సొబగులను గదుల్లో నుంచే వీక్షించేలా ఉన్న ఈ రిసార్టులు ఆకట్టుకుంటాయి. సూట్‌, డీలక్స్‌ సూట్‌, ఏసీ గదులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సీజన్‌లో పర్యాటకులకు గదుల కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ వసతి సదుపాయంగా టెంట్‌హౌస్‌లను సమకూర్చేలా ప్రణాళిక చేశాం. రిసార్టు సమీపంలో వాటిని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. ప్రస్తుతానికి 30 వరకు సిద్ధంగా ఉంచాం. డిమాండు మేరకు పెంచుతాం.
* ఏపీటీడీసీకి విశాఖలో 1, టైడాలో 1, అనంతగిరి 1, అరకు 2, లంబసింగిలో ఒక రిసార్టు ఉన్నాయి. వీటన్నింటిలో 180 వరకు గదులున్నాయి. సందర్శకులను ఆకట్టుకునేలా ప్రస్తుత సీజన్‌కు వాటిని సిద్ధం చేశాం. ఎక్కడికక్కడ మరమ్మతులు పూర్తి చేశాం. ప్రస్తుతానికి వారాంతాల్లో గదుల కోసం డిమాండు ఉంది. సంక్రాంతి వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.
ఇప్పటికే చాలా గదులను సందర్శకులు బుక్‌ చేసుకున్నారు. ప్యాకేజీల నిర్వహణకు మినీ బస్సులు, ఇన్నోవాలను సిద్ధంగా ఉంచాం. డిమాండు ఆధారంగా వాటిని నడిపేలా ప్రణాళిక చేశాం. ప్యాకేజీలు, గదుల బుకింగ్‌ నిమిత్తం ‘టూరిజం ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌, 98488 13584, 88974 64333 నెంబర్లలో సంప్రదించొచ్చు.
* విశాఖ నుంచి తిరుపతి, శ్రీశైలం ప్యాకేజీల నిర్వహణకు ప్రతిపాదనలు చేశాం. ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చిన వెంటనే నడపాలనుకుంటున్నాం. కొత్తగా విశాఖ నుంచి రాయగడ మీదుగా కొరాపుట్‌ మార్గంలో ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నాం. ఈ మార్గంలో నడిచే రైలుకు అద్దాల బోగీ జత చేయడంతో సందర్శనీయ ప్రాంతాల ఆధారంగా ప్యాకేజీల రూపకల్పనపై ఆలోచన చేస్తున్నాం. రైల్వే అధికారులతో కలిసి ఇప్పటికే ఒకసారి రాయగడ-కొరాపుట్‌ మార్గంలో పర్యటించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని