logo

రెస్కో.. మా ఖాతాలోనే వేస్కో

ఈపీడీసీఎల్‌ పరిధిలో ఉన్న అనకాపల్లి గ్రామీణ సహకార విద్యుత్తు సంస్థ (రెస్కో)పై పట్టు సాధించడానికి ఏడాదిగా అధికార పార్టీ నేతలు చేస్తున్న యత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 06 Dec 2022 03:26 IST

పావులు కదిపిన అధికార పార్టీ నేతలు
ప్రజాభిప్రాయ సేకరణ నామమాత్రమేనా!
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

ఈపీడీసీఎల్‌ పరిధిలో ఉన్న అనకాపల్లి గ్రామీణ సహకార విద్యుత్తు సంస్థ (రెస్కో)పై పట్టు సాధించడానికి ఏడాదిగా అధికార పార్టీ నేతలు చేస్తున్న యత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.

విద్యుత్తు పంపిణీ, సరఫరాకు సంబంధించి తమ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి దరఖాస్తు చేసింది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతిస్తోంది. దీంతో అసలు వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఏపీఈఆర్సీ చర్యలు చేపట్టింది.

ఈనెల 14న ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని ప్రకటించింది. అయితే ఇది హైదరాబాద్‌లో జరపనుండటం గమనార్హం. అయితే ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లి అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు ఎవరుంటారని రెస్కోకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికే అక్కడ పెట్టారనే విమర్శలు వచ్చాయి. దీంతో స్థానికులు నేరుగా రాలేకపోయినా వర్చువల్‌గా ఇక్కడి నుంచే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని సూచనలు చేయవచ్చని ఏపీఈఆర్సీ తాజాగా ప్రకటించింది.

...అయినా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం నామమాత్రమేనని రెస్కోకి లైసెన్స్‌ జారీచేయడానికి మార్గం సుగమం చేసినట్లు ఈపీడీసీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.

దుర్వినియోగంపై ఆరోపణలున్నా..ఈపీడీసీఎల్‌ నుంచి తక్కువ ధరకు విద్యుత్తు కొని డిస్కం రేట్లకు ఇక్కడి వినియోగదారులకు అమ్ముతుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుచేస్తున్నా ఎక్కువ మొత్తం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలే రెస్కోని ఈపీడీసీఎల్‌లో విలీనం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో గతేడాది మార్చిలో రెస్కోకి లైసెన్స్‌ జారీచేయకుండా ఈపీడీసీఎల్‌లో పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే మంత్రి అమర్‌నాథ్‌ వర్గం మాత్రం రెస్కోని ఎట్టి పరిస్థితుల్లో ఈపీడీసీఎల్‌లో విలీనం చేయడానికి ఒప్పుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనుకూలంగా ఓ లేఖను ఏపీఈఆర్సీకి పంపించారు.  దానిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోక ముందరే రెస్కో ఈపీడీసీఎల్‌ నుంచి వెనక్కి వచ్చేసిందంటూ హడావుడి చేసి కార్యకలాపాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

రెండు నెలల పాటు ఈపీడీసీఎల్‌ అధికారులను పక్కన పెట్టి అంతా నడిపించారు. ఈ వ్యవహారంపై కథనాలు రావడంతో ఈఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది.

రెస్కో అధికారుల అత్యుత్సాహాన్ని ఎండగట్టి  గట్టి చర్యలు తీసుకుంది. వారేం చేస్తున్నా పట్టించుకోలేదంటూ ఈపీడీసీఎల్‌ సీఎండీని సైతం ఈఆర్సీ తప్పు పట్టింది.

రెస్కోను మరలా డిస్కం  పరిధిలోకే తీసుకొచ్చింది. ఇంత జరిగినా నేతలు పట్టు వదలకుండా పావులు కదుపుతూనే ఉన్నారు.

ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో 2022-23లో మిగిలిన కాలానికి లైసెన్స్‌ జారీచేయడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. పనిలో పనిగా ఈనెల 14నే గతంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణను చేపట్టబోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు