logo

గుప్పు గుప్పు ఎక్కువే... చిక్కేది తక్కువే!!

గత రెండు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో చిక్కిన గంజాయి నిందితుల జాబితా ఇది.. అయితే 5 కేజీల లోపు సరకు మాత్రమే దొరుకుతోంది. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా మైదాన ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతోంది.

Published : 06 Dec 2022 03:26 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

గత రెండు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో చిక్కిన గంజాయి నిందితుల జాబితా ఇది.. అయితే 5 కేజీల లోపు సరకు మాత్రమే దొరుకుతోంది. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా మైదాన ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతోంది.

* డిసెంబరు 1న అనకాపల్లి జిల్లా మాకవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పరిశీలించగా నాలుగు కేజీల గంజాయి  దొరికింది.
* నవంబరు 28: రోలుగుంట మండలం నిండుగొండ గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకులపై వస్తున్న ఇద్దరు
6 కేజీల గంజాయితో పోలీసులకు చిక్కారు.
* నవంబరు 24: నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన సురేష్‌ సేన్‌ అనే వ్యక్తిని తనిఖీ చేసి కేజీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
* నవంబరు22: రోలుగుంట మండలం రొంగలపాలెం వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 126 కేజీల గంజాయి దొరికింది.
* నవంబరు21: పాయకరావుపేట మండలం తాండవ కూడలి వద్ద అనుమానాస్పద వ్యక్తుల నుంచి 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* నవంబరు 15 : నర్సీపట్నంలో రెసిడెన్సీలో 4 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
* నవంబరు10: నక్కపల్లిలోని కాగిత టోల్‌ ప్లాజా వద్ద వ్యానులో తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పట్టుకుని  ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు.

జాతీయ నేర గణాంకాల్లో గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాలో అగ్రస్థానంలో ఉందని తేలింది. అయితే పోలీసులు పట్టుకుంటున్నది గోరంత, తరలిపోతుంది కొండంత అన్న చందంగా మారింది. గంజాయి, నాటుసారా అరికట్టే చర్యల్లో భాగంగా శాంతిభద్రతల విభాగంతో పాటుగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సిబ్బంది నిఘా పెడుతున్నామని చెబుతున్నా.. పెద్దఎత్తున రవాణా జరుగుతూనే ఉంది.

* అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలోని డీ ఎడిక్షన్‌ సెంటర్‌కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత సిగరెట్లకు బానిసవుతున్నారు. కొంతమంది సిగరెట్లలో గంజాయి పెట్టి తాగుతున్నట్లు తేలింది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితికి దారి తీస్తుందని పలువురు భయాందోళనలు చెందుతున్నారు.

* అనకాపల్లి జిల్లా కేంద్రంలో గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారుచేసి అమ్మకాలు చేస్తున్న వ్యక్తులను  ఆ మధ్య కాలంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి గంజాయి తాగడానికి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

* అచ్యుతాపురం సెజ్‌లో  జరిగిన ఒక హత్యకు గంజాయి తాగడమే ప్రధాన కారణమని తేలింది.

* నర్సీపట్నంలో ఓ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు గంజాయికి బానిస అని పోలీసులు తేల్చారు.

ఇలా మత్తు కోసం గంజాయి వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. గంజాయి సులభంగా దొరకడంతో దీన్ని తాగి మత్తుకు బానిసలవుతున్నారు.

అనకాపల్లిలో గంజాయి నిల్వలను దహనం చేస్తున్న అప్పటి డీజీపీ సవాంగ్‌

నిఘా పెంచుతున్నా తరలిపోతున్న గంజాయి

విజిబుల్‌ పోలీసింగ్‌ పేరుతో పోలీసులు నిఘా పెంచుతున్నారు. అయినా గంజాయి తరలించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి ఎక్కడ పండిస్తున్నది?, ఎలా తరలిస్తున్నారనే సమాచారం పోలీసుల వద్ద పక్కాగా ఉండేది. జిల్లాల పునర్విభజన జరిగాక ఎవరి హద్దులు వారివే అన్నట్లుగా
పరిస్థితి మారింది. దీంతో పెద్ద మొత్తంలో గంజాయి తరలించే సమాచారం పోలీసులకు అందడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పర్యటకుల ముసుగులో  గంజాయి తరలించే వారిని తనిఖీ చేసే వ్యవస్థ లేదు. అయితే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడంలో చొరవచూపిన ఎస్సైలు, సిబ్బందికి ఎస్పీ గౌతమి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

మత్తుతో జీవితాలు నాశనం : సరదాగా సిగరెట్టు, బీడీల్లో గంజాయి పెట్టి తాగడం ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తుంది. యువతలో దీన్ని తగ్గించేందుకు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో కౌన్సిలింగ్‌ చేసి మందులిస్తున్నాం. నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ కింద ఇలాంటి వారికి చికిత్స ఇవ్వొచ్చు. జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారికి అందించిన చికిత్స, మందులతో చాలామంది అలవాటు మానేశారు.

కాపు శ్యామల, సైకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని