logo

తనిఖీలకు తాత్సారమెందుకు?

నాతవరం మండలం లేటరైట్‌ క్వారీని సంయుక్త కమిటీతో తనిఖీ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాజాగా ఆదేశించింది.

Published : 07 Dec 2022 03:08 IST

లేటరైట్‌ క్వారీపై వారంలో నివేదికివ్వండి: ఎన్జీటీ

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

బమిడికిలొద్ది లేటరైట్‌ క్వారీ ప్రాంతం

నాతవరం మండలం లేటరైట్‌ క్వారీని సంయుక్త కమిటీతో తనిఖీ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాజాగా ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని బమిడికలొద్దిలోని ఓ కొండ పైభాగాన 120 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ క్వారీ ఉంది. కొయ్యూరు మండలానికి చెందిన జర్తా లక్ష్మణరావు ఈ క్వారీని లీజుకు తీసుకున్నా నిర్వహణ మొత్తం అధికార పార్టీ పెద్దలే చేపడుతున్నారు. ఇక్కడి లేటరైట్‌ తరలించడానికి అవసరమైన రహదారి నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉపాధి నిధులతో రోడ్డు నిర్మించారు. సాగునీటి వనరులను కప్పేశారు.. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతుల ప్రాణాలకు ముప్పుతెచ్చారు. తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డలను కలుషితం చేశారు. ఈ తవ్వకాలపై దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కోండ్రు మరిడియ్య లేటరైట్‌ తవ్వకాలను నిలువరించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులతో ఓ సంయుక్త కమిటీని వేసి క్వారిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాల పునర్విభజనకు ముందే విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునతో పాటు మరికొందరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నివేదికను ఇచ్చారు. అయితే లేటరైట్‌ ఉన్న ప్రాంతం నర్సీపట్నం అటవీశాఖ పరిధిలో ఉంటే కమిటీలో విశాఖపట్నం డీఎఫ్‌వోను నియమించారు. దీనిపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త కమిటీని నియమించి క్వారీని తనిఖీ చేయాలని ఇటీవల ఎన్‌జీటీ ఆదేశించింది. తాజాగా సోమవారం జరిగిన విచారణలో గత ఆదేశాల ప్రకారం వారంలో సంయుక్త కమిటీ తనిఖీ చేపడుతుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది వివరించారు.

కేసు విచారణలో ఉన్నా తరలింపు

లేటరైట్‌ క్వారీ వల్ల పర్యావరణ నష్టంతో పాటు అనుమతుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, రక్షిత అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదుదారుడు వాదిస్తున్నారు. మేం అన్ని అనుమతులు తీసుకున్నాం.. నిబంధనల మేరకే తవ్వుకుంటున్నామని లీజుదారుడి తరఫున అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ వివాదాస్పద క్వారీపై గత కొంత కాలంగా ఎన్‌జీటీలో విచారణ కొనసాగుతోంది. అయితే ఎన్‌జీటీ క్వారీని పరిశీలించాలని సూచించిందే తప్ప తవ్వకాలు నిలిపేయాలని చెప్పలేదంటూ లేటరైట్‌ను జోరుగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు లక్షన్నర టన్నులు అధికారికంగా తరలించారు. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఇక్కడ లేటరైట్‌లో ఎక్కువ భాగం భారతీ సిమెంటు కంపెనీలకే తరలిపోతోంది. అందుకే ఇక్కడ ఎంత మేర తవ్వకాలు జరుగుతున్నాయి?, ఎంత తరలిస్తున్నారని తనిఖీలు చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. ఈ విషయమై అనకాపల్లి గనులశాఖ ఏడీ సుబ్బారాయుడు వద్ద ప్రస్తావించగా గతంలో పర్మిట్లు తీసుకునే తరలించారని చెప్పారు. గత రెండు నెలలుగా పర్మిట్లు తీసుకోలేదని, ప్రస్తుతం లేటరైట్‌ తరలిస్తున్నట్లు సమాచారం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని