logo

మన్యంలో ఇప్పటికీ నాటు వైద్యమే!!

శ్యామల ఏయూలో  ఎమ్మెస్సీ అనంతరం 1996లో పీహెచ్‌డీలో సీటు సాధించారు. అదే సమయంలో ఎంపీడీవోగా కూడా ఉద్యోగం రావడంతో పీహెచ్‌డీ చేయలేకపోయారు.

Published : 07 Dec 2022 03:05 IST

వాల్మీకి తెగలో 80 మంది వైద్యులు

ఈనాడు, విశాఖపట్నం

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నాటు వైద్యులకు నేటికీ విశేష ఆదరణ లభిస్తోందని ఆంధ్రవిశ్వవిద్యాలయ పరిశోధకురాలి పరిశోధనల్లో తేలింది.


ఈ కుటుంబాల్లోని పెద్దలు తరతరాలుగా తమ వారసులకు వైద్య విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. వీరి ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నారు.


విశాఖకు చెందిన తాసుపల్లి శ్యామల ఏయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య ఎస్‌.బి.పడాల్‌ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి ఆసక్తికర విశేషాలను వెలుగులోకి తెచ్చారు.

శ్యామల

శ్యామల ఏయూలో  ఎమ్మెస్సీ అనంతరం 1996లో పీహెచ్‌డీలో సీటు సాధించారు. అదే సమయంలో ఎంపీడీవోగా కూడా ఉద్యోగం రావడంతో పీహెచ్‌డీ చేయలేకపోయారు. వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేయాలన్న ఉద్దేశంతో 2014లో పార్ట్‌టైమ్‌ పరిశోధకురాలిగా చేరారు. వృక్షశాస్త్ర నైపుణ్యాలతో గిరిజన నాటు వైద్యులు ఏ విధంగా వైద్యం చేయగలుగుతున్నారన్న అంశాలపై విస్తృతంగా పరిశీలన చేశారు. పెదబయలు, ముంచింగుపుట్టు, అరకు, పాడేరు, అనంతగిరి, చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల తదితర ప్రాంతాలతోపాటు, సమీప గిరిజన తండాలలో పర్యటించారు. ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో నాటు వైద్యం చేస్తున్న వారితో మాట్లాడి పలు ఆసక్తికర వివరాలు రాబట్టారు.

గిరిజన ప్రాంతాల్లో నాటు వైద్యం చేస్తున్న వారిలో అత్యధికులు వాల్మీకి తెగవారే. వీరి సంఖ్య దాదాపు 80 వరకూ ఉంటుంది. ‘క్వాంటిటేటివ్‌ స్టడీస్‌ ఆన్‌ ఇథనో మెడిసినల్‌ ప్లాంట్స్‌ యూజ్డ్‌ బై వాల్మీకి ట్రైబ్స్‌ ఇన్‌ పాడేరు’ అనే పరిశోధన గ్రంథాన్ని తయారు చేశారు.

వృక్షాలు, మొక్కలకు చెందిన వేర్లు, ఆకులు, కాండం,  తదితర 25 భాగాలతో వారు పలు రకాల మందులను తయారుచేస్తున్నారు.

తమ వైద్యానికి 237 జాతుల మొక్కలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాటితో 93 రకాల వ్యాధులకు చక్కటి వైద్యం చేయగలుగుతున్నారు. ఆ విషయాల నిర్ధరణకు నాటు వైద్యుల  వద్దకు వచ్చిన వారితో మాట్లాడి... వైద్యం పూర్తైన తరువాత ఆ రోగుల ఇళ్లకు వెళ్లి వారికి నిజంగా వ్యాధి తగ్గిందా? లేదా?  ఉపశమనం పొందారా లేదా అన్న విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

వివిధ మందులు, ఆయుర్వేదంలో సూచించిన మొక్కల జాతులతో చాలా వరకు సరిపోలుతున్నట్లు వివరించారు.

నాటు వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న తమ తండ్రి/ బంధువుల దగ్గర శిష్యరికం చేసి, వారి సూచనల ప్రకారం మందులు తయారు చేయడంలో శిక్షణ పొందడం మినహా వారు ఇతర చదువులేమీ చదవడంలేదు.

పట్టాలు లేకపోయినా... వైద్య పరిజ్ఞానం పుష్కలం: ‘నాటు వైద్యుల ద్వారా చాలా రోగాలు నయమవుతున్నట్లు తెలిసి వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అదే అంశంపై పరిశోధనలు ఆరంభించాను. ఉమ్మడి విశాఖ జిల్లాలోని దాదాపు 12 మండలాల్లో తిరిగి నాటు వైద్యులతోనూ, రోగులతోనూ మాట్లాడాను. ఇస్తున్న మందులు, తయారీకి వినియోగిస్తున్న పలు వృక్షాలకు చెందిన భాగాలను పరిశీలించాను. చాలా మందికి వ్యాధులు నయమవుతున్నాయి. గిరిజన తండాల్లో కొందరి దగ్గర పట్టాలు లేకపోయినా అనుభవంతో వచ్చిన పుష్కలమైన వైద్య పరిజ్ఞానం మాత్రం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని