logo

గృహప్రవేశానికి ధరల సెగ

నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్‌ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 07 Dec 2022 03:05 IST

జగనన్న కాలనీల్లో నిర్మాణాలు నత్తనడక

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి

దేవరాపల్లి సమీపంలోని ఓ లేఅవుట్‌లో అసంపూర్తి నిర్మాణాలు

నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్‌ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా జిల్లాలో తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే గడువు నాటికి జిల్లాలో లక్ష్యం మేర ఇళ్ల నిర్మాణాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో లక్ష్యం చేరుకోవడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇళ్లు నిర్మిస్తారా?, లేకుంటే పట్టాలు రద్దు చేయమంటారా అని బెదిరింపులకు దిగాల్సి వస్తోంది.

జిల్లాలో 44,133 మందికి ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 10,462 ఇళ్లు సొంత స్థలం కలిగిన వారికి మంజూరు చేశారు. మిగతా వారికి 787 లేఅవుట్లలో స్థలాలు ఇచ్చారు. వీటన్నింటినీ 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు 41 వేల మంది లబ్ధిదారులతో భూమి పూజ నిర్వహించారు. తర్వాత నిర్మాణాల్లో ఆ జోరు కనిపించలేదు. నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. లేఅవుట్లు ఊరికి దూరంగా ఉండడం, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు పక్కన స్థలాలివ్వడంతో ప్రభుత్వం ఇచ్చిన యూనిట్‌ ధరతో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని అసంపూర్తిగా వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు 3,500 ఇళ్లు శ్లాబులు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు.. మరో పక్షం రోజుల్లో సామూహిక గృహ ప్రవేశాలు చేయబోతున్నారు. అప్పటికి మిగతా 5,500 ఇళ్లు పూర్తిచేయడం అనుమానమేనని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి.

కానరాని మౌలిక సదుపాయాలు

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై ప్రతి శనివారం హౌసింగ్‌ డే పేరుతో అధికారులు సమీక్షిస్తున్నారు.. ఇళ్ల పనులు మొదలుపెట్టని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. లేఅవుట్లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై మౌనం దాల్చుతున్నారు. కొన్ని లేఅవుట్లలోకి నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లడానికి కూడా వీలులేనంతగా రహదారులున్నాయి. కుళాయిలు ఏర్పాటు చేసినా ఆ నీళ్లు నిర్మాణాలకు సరిపోవడం లేదు. నిర్మాణ సామగ్రిని నిల్వచేయడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. వీటిని ఏ రోజు అవసరాలకు ఆ రోజు కొని తరలించడం భారంగా మారుతోంది. ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు.


ప్రభుత్వం సరఫరా చేసే సామగ్రి చాలడం లేదు. బయట అంతకు రెండింతలు కొనాల్సి వస్తోంది. ఇటుక, సిమెంటు, ఇనుము ఖర్చులు పెరుగుతుండడంతో నిర్మాణాలపై పునరాలోచనలో పడుతున్నారు. జిల్లాలో ఇసుకకు కొరత ఉంది. నర్సీపట్నం ఇసుక డిపో నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. మిగతా డిపోల్లోను అరకొరగానే ఉన్నాయి.


నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాం...

కూర్మినాయుడు, జిల్లా హౌసింగ్‌ హెడ్‌, అనకాపల్లి

ప్రభుత్వమిచ్చే యూనిట్‌ ధరకు అదనంగా స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.35 వేలు రుణం ఇప్పిస్తున్నాం. కాలనీలో సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ప్రతి శనివారం లబ్ధిదారుల దగ్గరకే వెళ్లి నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రోత్సహిస్తున్నాం. సామూహిక గృహ ప్రవేశాల నాటికి 80 శాతం లక్ష్యం చేరుకుంటామనే నమ్మకం ఉంది. మిగతా ఇళ్లను వేగంగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని