logo

అరకొరగా చౌక బియ్యం పంపిణీ

తెల్లకార్డుదారులకు ఈనెల చౌక బియ్యం పూర్తి స్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని అన్న చందంగా జిల్లాలో బియ్యం సరఫరా వ్యవస్థ తయారైంది.

Published : 07 Dec 2022 03:05 IST

పూర్తి స్థాయిలో డిపోలకు చేరని సరకు గోదాముల్లో ఉన్న బియ్యం బస్తాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెల్లకార్డుదారులకు ఈనెల చౌక బియ్యం పూర్తి స్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని అన్న చందంగా జిల్లాలో బియ్యం సరఫరా వ్యవస్థ తయారైంది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న పెందుర్తి ప్రధాన గోదాములో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ మర్రిపాలెం, అగనంపూడి, ఆనందపురం, భీమునిపట్నం ప్రాంతాల్లో ఉండే మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సకాలంలో సరకు చేర్చడంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ (సీఎస్‌సీ) విఫలమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 640 డిపోల్లో రేషన్‌ పంపిణీ నెమ్మదిగా సాగుతోంది.

ప్రస్తుతం డిపోల్లో కేవలం 50శాతం కార్డుదారులకు సరిపడా బియ్యం నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో వారం రోజుల్లో పంపిణీ ముగియాల్సి ఉంది. ఈ తరుణంలో గోదాముల నుంచి బియ్యం నిల్వలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నెలలో పూర్తి స్థాయిలో పంపిణీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని డిపోల్లో బియ్యం అందుబాటులో లేవని డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు చెబుతుండడంతో కార్డుదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

చేతులెత్తేసిన గుత్తేదారు

పెందుర్తిలోని ప్రధాన గోదాము నుంచి జిల్లా అవసరాలకు సరిపడా 9వేల టన్నుల బియాన్ని ప్రతినెల మర్రిపాలెం, అగనంపూడి, ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మండలాల్లోని నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. ఆయా పాయింట్ల నుంచి డీలర్లకు బియ్యం చేరవేస్తారు. ప్రతి నెల 20వ తేదీ తర్వాత ఈ ప్రక్రియ చేపట్టి నెలాఖరుకు ముగిస్తారు. అయితే గత కొద్దిరోజులుగా పెందుర్తిలోని ప్రధాన నిల్వ కేంద్రం మండల స్థాయి కేంద్రాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. బియ్యం సరఫరా బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు చేతులెత్తేశారు. ప్రత్యామ్నాయాలు చూడాల్సిన అధికారులు పట్టనట్లు ఉండిపోయారు. దీంతో ఈనెల కేవలం 50శాతం బియ్యం డిపోలకు చేరింది. ఇది పంపిణీ అయ్యాక ఏమి చేయాలో తెలియడం లేదని డీలర్లు వాపోతున్నారు.

ఒకటి, రెండు రోజుల్లో పెందుర్తి ప్రధాన గోదాము నుంచి సరకు వస్తుందని, కార్డుదారులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా... పెద్ద సంఖ్యలో లారీలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన తరలిస్తే గాని గడువులోపు కార్డుదారులకు బియ్యం అందజేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని