మద్యం మత్తులో ఘర్షణ.. వృద్ధుడి మృతి

చిత్తు కాగితాలు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 07 Dec 2022 04:28 IST

నిందితుడు నాగరాజు

గాజువాక, న్యూస్‌టుడే: చిత్తు కాగితాలు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గాజువాక పోలీసుస్టేషన్‌ పరిధి శ్రీనగర్‌లోని తుక్కు దుకాణం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ ఎల్‌.భాస్కరరావు కథనం ప్రకారం..విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన దీమర్తి లక్ష్మణరావు(58) శ్రీనగర్‌లో భార్య చంద్రమ్మతో ఉంటున్నారు. పాత గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన నక్క నాగరాజుతో కలిసి ఉదయం చిత్తు కాగితాలు ఏరుకుని అనంతరం తుక్కు దుకాణం వద్దకు వచ్చారు. పని ముగించుకుని ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ‘నాకు సరకు దక్కకుండా చేస్తున్నావు’ అంటూ పరస్పరం వాదులాడుకున్నారు. ‘నువ్వెంతంటే నువ్వెంత’ అని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపం పట్టలేని నాగరాజు.. లక్ష్మణరావు తలను నేలకేసి బాదడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సమీపంలోని వారు చంద్రమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ కాసేపటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. సీఐ భాస్కరరావు, ఎస్‌ఐ సతీష్‌ విచారణ జరిపారు. భార్య చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని