logo

భార్యను తీసుకెళ్లడానికి వచ్చి అనంత లోకాలకు..

అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆమెను తీసుకెళ్లకుండానే అందనంత దూరాలకు వెళ్లిపోయిన సంఘటన.

Published : 07 Dec 2022 03:05 IST

పాలవ్యాను ఢీకొని సరుగుడు కర్రల వ్యాపారి మృతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న భార్యను ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆమెను తీసుకెళ్లకుండానే అందనంత దూరాలకు వెళ్లిపోయిన సంఘటన మండలంలో ఇరువాడ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జరిగింది. స్థానిక సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెం గ్రామానికి చెందిన సరుగుడు కర్రల వ్యాపారి బంటుపల్లి తాతారావు(53) భార్య ధనలక్ష్మి అనారోగ్యంతో గాజువాక ఆసుపత్రి వెళ్లారు. ఆమె తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకు రావడానికి మంగళవారం రాత్రి 8.30గంటలకు ఇరువాడ కూడలికి వెళ్లాడు. భార్య ధనలక్ష్మి మరో 10 నిముషాల్లో బస్సుల్లో రానుండటంతో రోడ్డు పక్కన ద్విచక్రవాహనం నిలిపి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో నాగవారం నుంచి పరవాడ వైపు వెళ్తున్న మినీ పాల వ్యాను వేగంగా వచ్చి తాతారావును ఢీ కొంది. 50 అడుగుల వరకు తాతారావును ఈడ్చుకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాతారావు అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లిపోవడానికి ఆనందంగా బస్సు దిగిన భార్యకు విగతజీవిగా రోడ్డుపై పడిఉన్న భర్త కనిపించడంతో కన్నీటి పర్యంతమైంది. నా కోసం వచ్చి అన్యాయంగా చనిపోయావా? అంటూ ఆమె పెట్టిన రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. మృతుడికి భార్య ధనలక్ష్మితో పాటు శివ అనే కుమారుడు ఉన్నాడు. సరుడుగు కర్రల వ్యాపారిగా, సౌమ్యుడిగా మంచివ్యక్తిగా గుర్తింపు పొందిన తాతారావు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని విషయం తెలియడంతో రావిపాలెంలో విషాధం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని