logo

ఎరువుల సొమ్ము పక్కదారి

ప్రభుత్వ సేవలను అన్నదాతలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) గాడితప్పుతున్నాయి. సమయపాలన నుంచి సిబ్బంది పనితీరు వరకు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.

Updated : 08 Dec 2022 05:50 IST

 ఆర్బీకేల్లో సిబ్బంది నిర్వాకం
రికవరీకి షోకాజ్‌ నోటీసులు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

ప్రభుత్వ సేవలను అన్నదాతలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) గాడితప్పుతున్నాయి. సమయపాలన నుంచి సిబ్బంది పనితీరు వరకు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎరువుల అమ్మకాల్లో గ్రామ వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకులు గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారు. కీలక సమయాల్లో అధికార పార్టీ నేతల సిఫార్సులున్న వారికే ఆర్బీకేల్లో ఎరువులిస్తున్నారు.. మిగతా వారికి రెండు, మూడు రోజులు తిరిగితేగాని ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు సిబ్బంది ఎరువులు అమ్మగా వచ్చిన సొమ్ములను కూడా సకాలంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించడం లేదు. సొంతానికి వాడుకుంటున్నారు. ఇటీవల ఎరువుల సొమ్మును పక్కదారి పట్టించిన వారిని గుర్తించి షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణ లేమి, సిబ్బంది చర్యలతో ఆర్బీకేల ప్రతిష్ఠ మసకబారుతోంది.

అనకాపల్లి జిల్లాలో 450 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటిలో 439 ఆర్బీకేల ద్వారా గడిచిన ఖరీఫ్‌, ప్రస్తుత రభీ సీజన్లకు సంబంధించి సుమారు 10 వేల టన్నులకు పైగా ఎరువులను అందుబాటులో ఉంచారు. వీటికి మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువులను సరఫరా చేశారు. వీటిలో అమ్మిన ఎరువులకు సంబంధించిన సొమ్మును వారానికి ఒకసారి మార్క్‌ఫెడ్‌ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. కొంతమంది సిబ్బంది నెలలు దాటినా ఈ సొమ్ములు చెల్లించడం లేదు. వందలు, వేలే కాదు.. రూ.లక్షల్లో సొమ్ములను సొంతానికి వాడేసుకుంటున్నారు. అధికారులు గమనించి గట్టిగా అడిగినప్పుడు, విధుల నుంచి తొలగించాల్సి వస్తుందని నోటీసులు ఇచ్చినప్పుడే వాడుకున్న సొమ్మును వెనక్కి ఇస్తున్నారు. రూ.10 వేలకు పైబడిన వారి నుంచి వెంటనే రికవరీలు చేయాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సూచించారు. రూ.లక్ష పైబడిన వారికి నోటీసులు జారీచేయాలని, స్పందించకుంటే సస్పెండ్‌కు సిద్ధం చేయాలని  సంబంధిత శాఖలను ఆదేశించినట్లు తెలిసింది.

ఆన్‌లైన్‌లో అమ్మకాలు..ఆఫ్‌లైన్లో అక్రమాలు

ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకాలన్నీ యాప్‌ ద్వారానే నిర్వహించాలి. దీనివల్ల ఎరువుల డిమాండ్‌ను ఏరోజుకు ఆరోజు తెలుసుకోవడానికి వీలవుతుంది. యాప్‌ ద్వారా అమ్మిన ఎరువులకు సంబంధించిన సొమ్ములను ముందు ఆర్బీకే ఖాతాలో జమచేసి వారం రోజుల తర్వాత మార్క్‌ఫెడ్‌కు బదిలీ చేయాలి. గరిష్ఠంగా రూ.25 వేలలోపు ఎరువులను అమ్మిన తర్వాత సొమ్ములు చెల్లించాలి. ఆ తర్వాత ఇండెంట్‌ పెట్టినా ఎరువులు సరఫరా చేయరు. దీంతో కొందరు యాప్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఎరువులు అమ్మి ఆ సొమ్ములను మార్క్‌ఫెడ్‌కు చెల్లించకుండా జేబులో వేసుకున్నారు. రెండు నెలల క్రితం వ్యవసాయాధికారుల తనిఖీలో నాతవరం మండలంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మిగతా చోట్ల కొంతమంది ఈ విధంగా సొమ్ములు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది.

ఎక్కడెక్కడ..

* జిల్లాలో రూ.10 వేలకు పైగా ఎరువులు సొమ్ములు సకాలంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించనివారు ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు నోటీసులు ఇచ్చాక తిరిగి చెల్లించారు. నాతవరం మండలం చమ్మచింతలో ఉద్యాన సహాయకుడి నుంచి రూ.3.2 లక్షలు, అచ్యుతాపురం దోసూరులో వ్యవసాయ సహాయకుడి నుంచి రూ.2 లక్షలు ఇటీవల వసూలు చేయగలిగారు.
* పాయకరావుపేట మండలం నర్సాపురం ఆర్బీకేలో వ్యవసాయ సహాయకురాలు సెలవులో ఉన్నారు. దీంతో సమీప ఆర్బీకే నుంచి ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈయన ఎరువుల సొమ్ములో రూ.1.39 లక్షలు మార్క్‌ఫెడ్‌కు తిరిగి చెల్లించలేదు. షోకాజ్‌ నోటీసు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇతనిపై వేటు వేయడానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
* బుచ్చెయ్యపేట మండలంలో ముగ్గురు, రావికమతం, నాతవరం మండలాల్లో ఒక్కొక్కరు రూ.10 వేలకు పైగా ఎరువులు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. వీరి నుంచి రికవరీకి ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.10 వేల లోపు చెల్లించాల్సిన వారు 50 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఈ-క్రాప్‌, ఇతర పనుల్లో నిమగ్నమై సకాలంలో చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది.

రికవరీకి చర్యలు..

మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన ఎరువుల డబ్బుల గురించి వారాంతంలో వ్యవసాయ శాఖ అధికారులకు జాబితాలిచ్చి గుర్తుచేస్తున్నాం. వారు కూడా బాధ్యుల నుంచి రికవరీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒకరిద్దరికి నోటీసులు ఇవ్వగానే సొమ్ములు కట్టేశారు. రూ.లక్ష పైబడి చెల్లించాల్సింది ఒక్కరే ఉన్నారు. మిగతావారంతా చిన్న మొత్తాలే కాబట్టి సమస్య లేదు.

 అరుణ, మార్క్‌ఫెడ్‌ డీఎం, అనకాపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని