logo

అన్ని చోట్లా పడిగాపులే

బస్సుల కొరత జేబు దొంగలకు కలిసొచ్చింది. విజయవాడలో వైకాపా నిర్వహించిన జయహో బీసీ గర్జన కార్యక్రమానికి అనకాపల్లి డిపో నుంచి 47 బస్సులను పంపారు.

Published : 08 Dec 2022 05:23 IST

పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్న బాధితుడు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బస్సుల కొరత జేబు దొంగలకు కలిసొచ్చింది. విజయవాడలో వైకాపా నిర్వహించిన జయహో బీసీ గర్జన కార్యక్రమానికి అనకాపల్లి డిపో నుంచి 47 బస్సులను పంపారు. డిపోలో మొత్తం 77 బస్సులు ఉంటే అందులో రెండొంతులు విజయవాడ వెళ్లిపోవడంతో సాధారణ ప్రయాణికులకు బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. బుధవారం సాయంత్రం విజయనగరం వెళ్లే బస్సు కోసం ప్రయాణికులు చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది. బస్సు వచ్చేసరికి ప్రయాణికులు పరుగులు తీశారు. రద్దీ ఏర్పడడంతో జేబు దొంగలు పనికానిచ్చేశారు. అడ్డతీగల మండలం గొడ్డివానిపాలెంకి చెందిన కె.సోమరాజు భార్య, పిల్లలతో కలసి మల్లినాయుడుపాలెం వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా జేబులోని పర్సును కాజేశారు. రూ. 20వేల నగదు పోయినట్లు బాధితుడు వాపోయాడు. అమలాపురానికి చెందిన సీహెచ్‌.నీలిమ సబ్బవరం మండలం అమృతపురం వెళ్లడానికి విజయనగరం బస్సు ఎక్కుతుండగా పర్సును కాజేశారు. అందులో రూ. 2 వేల నగదు, సెల్‌ఫోన్‌ ఉన్నాయని బాధితురాలు వాపోయారు.  అనకాపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విశాఖపట్నం, విజయనగరం, పాయకరావుపేట, మాడుగుల, నర్సీపట్నం వెళ్లేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.    

చీకట్లో.. చలిలో..

పాయకరావుపేట/పట్టణం: పాయకరావుపేట నుంచి అనకాపల్లి వైపు సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ బస్సులే రాకపోకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు చీకటి, చలిలో తీవ్ర అవస్థలు పడ్డారు. దీనికితోడు బస్టాండ్‌లో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. దోమలవ్యాప్తి కారణంగా వృద్ధులు, చిన్నారుల బాధ వర్ణనాతీతం.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌కి రోజువారీగా వచ్చే బస్సుల్లో సగం కూడారాలేదు. దీంతో ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విద్యార్థులు చాలా మంది బస్‌ పాస్‌లు ఉండి కూడా ఆటోల్లో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లారు. పల్లెవెలుగు బస్సులను ఎక్కువ రద్దు చేసి విజయవాడకు పంపారు. ఉద్యోగులకు బస్సులు దొరక్క ఇబ్బంది పడ్డారు.

నేటి మధ్యాహ్నం వరకూ ఇంతే

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 70 బస్సులు బయలుదేరి వెళ్లినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి తెలిపారు. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం ఉదయంలోగా డిపోలకు చేరుతాయన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు