logo

బీసీలను అణగదొక్కుతున్న వైకాపా

బీసీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, నామమాత్ర పదవులిచ్చి కపట ప్రేమ కనబర్చుతోందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు

Updated : 08 Dec 2022 05:51 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసనలో తెదేపా

ఆందోళనలో పాల్గొన్న తెదేపా నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: బీసీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, నామమాత్ర పదవులిచ్చి కపట ప్రేమ కనబర్చుతోందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. బీసీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నిరసిస్తూ బుధవారం విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ధ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎస్‌.శ్రీనివాసమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు.  పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో తెదేపాకు చెందిన బీసీ నాయకులపై వైకాపా నేతలు దాడులు చేయడంతోపాటు హత్యలకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మూడున్నరేళ్లలో బీసీల్లో ఉన్న చేతివృత్తుల వారికి రుణాలు ఇవ్వలేదు.  సుప్రీంకోర్టులో బీసీ కమిషన్‌ నివేదిక కాకుండా బీసీ కార్పొరేషన్‌ నివేదిక పెట్టడం వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం 24 శాతానికి పడిపోయింది. ఫలితంగా బీసీలు ఏకంగా 16వేల పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తూనే మరో పక్క జయహో బీసీ సదస్సు నిర్వహించడం జగన్‌ మోసపు విధానానికి నిదర్శనం. వైకాపా పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డిలు బీసీలను అణగదొక్కుతున్నార’ని ధ్వజమెత్తారు.
* పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ‘బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంతోపాటు  ఖర్చు చేయాలి. షరతులు లేకుండా విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ సలహాదారులు, వీసీ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయించాల’ని డిమాండ్‌ చేశారు.  
* దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ .. స్థానిక సంస్థల్లో రద్దు చేసిన పదిశాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్‌కు పూర్వ వైభవం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
* కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.శ్రీభరత్‌, రాష్ట్ర కార్యదర్శులు బండారు అప్పలనాయుడు, వీఎస్‌ఎన్‌ మూర్తియాదవ్‌, లొడగల కృష్ణ, పొడుగు కుమార్‌, బొండా జగన్‌, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు