logo

అడుగుకో సమస్య!

నిత్యం రద్దీగా ఉండే దువ్వాడ రైల్వేస్టేషన్‌లో సౌకర్యాల కల్పనపై వేగంగా చర్యలు ముందుకు సాగటం లేదు.

Published : 09 Dec 2022 05:42 IST

‘దువ్వాడ’ ఆదర్శ రైల్వేస్టేషన్‌ పరిస్థితి ఇదీ'

రైలుకి, ప్లాట్‌ఫాంకి మధ్య ఖాళీ ఇలా..

న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం: నిత్యం రద్దీగా ఉండే దువ్వాడ రైల్వేస్టేషన్‌లో సౌకర్యాల కల్పనపై వేగంగా చర్యలు ముందుకు సాగటం లేదు. ప్లాట్‌ఫారాల నిర్వహణ లోపం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారుతోంది. ‘ఆదర్శ’ స్టేషన్‌గా గుర్తింపు పొందినా, సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బుధవారం రైల్వే బోగీకి, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన యువతి మృత్యువుతో పోరాడి.. కన్నుమూయడంతో ఇక్కడి అసౌకర్యాలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* ఈ స్టేషన్‌ మీదుగా ప్రయాణించే రైళ్లలో నిత్యం దాదాపు 40కి పైగా రైళ్లకు హాల్టు సదుపాయం ఉంది. ఇవన్నీ మొదటి, నాలుగో ప్లాట్‌ఫారాల మీదుగానే రాకపోకలు సాగిస్తుండడంతో.. ఆయా ప్లాట్‌ఫారాల వినియోగం ఎక్కువ. ఒక్కోసారి హాల్టుల సమయం సరిపోక కొన్నింటిని వెంటనే ముందుకు పంపడం, మరి కొన్నింటిని స్టేషన్‌ బయటే నిలిపి ఉంచాల్సి వస్తోంది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. *   మొదటి, నాలుగో ప్లాట్‌ఫారాల్లో రైలుకి, ప్లాట్‌ఫారాలకు మధ్య ఖాళీ ఎక్కువగా ఉండడంతో... రైలు ఎక్కి, దిగేందుకు ప్రయాణికులు కష్టపడాల్సి వస్తోంది. కొన్నిసార్లు కాలు జారి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.
*   మొదటి ప్లాట్‌ఫాం లోతట్టుగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు. ఈ సమస్యను ఇటీవలే వాల్తేర్‌ రైల్వే డీఆర్‌ఎం దృష్టికి కొందరు తీసుకెళ్లారు. నాలుగో ప్లాట్‌ఫాం వైపు గరీబ్‌రథ్‌, జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ తదితర రైళ్లు వచ్చే సమయాల్లో రద్దీ ఎక్కువ.
*  వర్షం కురిస్తే మొదటి ప్లాట్‌ఫాంపై నీరు నిలుస్తుంది. ప్రయాణికులు రైళ్ల కోసం పరుగులు తీసే సమయంలో జారి పడుతున్నారు.

పని చేయని సూచికలు

స్టేషన్‌లోకి రైలు వచ్చే సమయంలో బోగీల వివరాలు సూచించే ‘కోచ్‌ ఇండికేటర్లు’ తరచూ ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. కొన్నిసార్లు కోచ్‌ నంబర్లు తప్పుగా చూపించడం, మరికొన్నిసార్లు అసలు నంబర్లే చూపకపోవడంతో... తమ కోచ్‌ ఎక్కుడుంతో తెలుసుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీస్తుంటారు. ఒక్కోసారి రైలువచ్చి ఆగిన తర్వాత కోచ్‌ నంబర్లు ప్రదర్శించడంతో పరుగులు తప్పడం లేదు. ఆ సమయంలోనే పలువురు హడావుడిగా రైలు ఎక్కుతూ జారి పడిపోతున్నారు. ఇలా గతంలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికి ముగ్గురు మృతి చెందారు.

సీసీ కెమెరాలు ఏవీ..

స్టేషన్‌లో ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రయాణికుల విలువైన సామగ్రిని పరిరక్షించేందుకు, ఏదైనా ఘటన జరిగిన సమయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు నిఘా నేత్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి. అవి లేక బుధవారం జరిగిన ప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని