logo

పేద విద్యార్థుల చదువులపై..చిన్నచూపే

విశాఖలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సమస్యలు విద్యార్థులకు పరీక్షగా మారాయి. తమ ప్రాంతానికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన పేద విద్యార్థులకు ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Updated : 09 Dec 2022 06:27 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అవస్థలెన్నో
నియామకాల ఊసే మరచిన పాలకులు

ఆనందపురం ఉన్నత పాఠశాలలో జూనియర్‌ కళాశాలకు కేటాయించిన ఓ తరగతి గది

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సమస్యలు విద్యార్థులకు పరీక్షగా మారాయి. తమ ప్రాంతానికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన పేద విద్యార్థులకు ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కో కళాశాలలో ఒక్కో రకమైన సమస్య. ఏళ్లుగా పూర్తిస్థాయి సిబ్బంది  లేరు. విద్యాబోధనకు అతిథి అధ్యాపకులపైనే ఆధారపడుతున్నారు.

ఆనందపురం, మల్కాపురంలలో జూనియర్‌ కళాశాలలను 2019లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే గదులు కేటాయించి జూనియర్‌ కళాశాల కార్యకలాపాలను ఆరంభించారు. కీలకమైన అధ్యాపకుల నియామకాలు మాత్రం చేపట్టలేదు. అతిథి అధ్యాపకులతో నిర్వహించుకోవాలని సూచించారు. పర్యవేక్షణకు వీలుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికపై విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులను డిప్యుటేషన్‌పై ‘ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌’గా పంపించారు. మిగిలిన బోధన సిబ్బంది అందరూ ‘అతిథి’ అధ్యాపకులే కావడం గమనార్హం.

గాజువాక సమీపంలోనే ఇస్లాంపేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 2007లో ఏర్పాటైంది. నేటికీ ఆ కళాశాలకు పూర్తిస్థాయి అధ్యాపకులు లేరు. ఒప్పంద, అతిథి అధ్యాపకులతోనే ఆ కళాశాల కొనసాగుతోంది.
  అతిథి అధ్యాపకుల కష్టాలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. వారికి ఇచ్చే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి నెలకు రూ.పది వేల వేతనం మించకూడదని మరో విస్మయకర నిబంధనను అమలు చేస్తున్నారు. జిల్లాలోని కళాశాలల్లో మరో తొమ్మిది మంది అతిథి అధ్యాపకుల నియామకం జరగాల్సి ఉన్నా...కార్యాచరణ ముందుకు కదలడం లేదు.
 మధురవాడ పరిసర ప్రాంతాల పేద పిల్లలకు చంద్రంపాలెం ఉన్నత పాఠశాల కొండంత అండగా నిలుస్తోంది. అక్కడ వేలాది మంది చదువుతున్నారు. ఇక్కడ జూనియర్‌ కళాశాల అవసరమని 2013లో ఏర్పాటుచేశారు. కేటాయించిన స్థలంలో భవన నిర్మాణాలు పూర్తైన తరువాత 2018లో నూతన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. కళాశాలకు అన్నీ వసతులూ ఉన్నా... పూర్తిస్థాయి అధ్యాపకుల నియామకం మాత్రం నేటికీ జరగలేదు.
 ఆనందపురం ఉన్నత పాఠశాలలో 2019లో జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎం.ఎల్‌.టి.(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌), ఎ.ఇ.టి.(ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌) కోర్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నేటికీ కేవలం ఎంపీసీ, సీఈసీ, ఎం.ఎల్‌.టి. కోర్సులనే నిర్వహిస్తున్నారు. కళాశాల నిర్వహణకు పాఠశాలలో తొలుత నాలుగు గదులు కేటాయించినా ప్రస్తుతం వాటిని రెండు గదులకే పరిమితం చేశారు. కళాశాల నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించినా.... భవన నిర్మాణం మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. ఆనందపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు సుమారు 300 మంది ఉన్నా... ఇంటర్లో చేరడానికి మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ప్రారంభ సంవత్సరంలో ఎంపీసీ, సీఈసీ, ఎం.ఎల్‌.టి.లో 70మంది చేరగా.... ప్రస్తుతం కళాశాల మొత్తం మీద కేవలం 45 మంది విద్యార్థులే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని