logo

దిగొచ్చిన వీఎంఆర్‌డీఏ

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ ప్లాట్ల ధరలపై వీఎంఆర్‌డీఏ వెనక్కి తగ్గింది. ఈ పథకంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కరవైంది.

Updated : 09 Dec 2022 12:23 IST

పాలవలస లేఅవుట్‌లో ధర తగ్గింపు

ఈనాడు, విశాఖపట్నం: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ ప్లాట్ల ధరలపై వీఎంఆర్‌డీఏ వెనక్కి తగ్గింది. ఈ పథకంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కరవైంది. ఆశించినన్ని దరఖాస్తులు రాకపోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలోని పాలవలస లేఅవుట్‌లోని ప్లాట్ల స్పందనే రాలేదు. రెండు సార్లు గడువు పెంచి దరఖాస్తులు పిలిచినా ఫలితం లేదు. ఇక్కడ 446 ప్లాట్లకు గత నెలాఖరు వరకు కేవలం 71 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. పరిస్థితిని గుర్తించిన అధికారులు ఎట్టకేలకు చదరపు గజం ధర తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో చదరపు గజం ధర రూ.18 వేలు ఉండగా దాన్ని రూ.14,500కు తగ్గిస్తూ గురువారం ప్రకటన జారీ చేశారు. అన్ని మౌలిక వసతులతో సొంతింటిని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు మేరకు ధర తగ్గించినట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

* ‘జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌’ పథకంలో పాలవలస, జీఎస్‌అగ్రహారం, రామవరంలో లేఅవుట్లను వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసింది. జీఎస్‌ అగ్రహారం, రామవరంలో చ.గజం ధర రూ.14 వేలు, పాలవలసలో రూ.18 వేలుగా నిర్ణయించారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధర నిర్ణయించాలని చెబితే వీఎంఆర్‌డీఏ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. పాలవలస లేఅవుట్‌కు ఏకంగా అధిక ధర నిర్ణయించేశారు.  అక్కడ బహిరంగ మార్కెట్‌లో స్థలాలు అంతకన్నా తక్కువ ధరకే లభ్యమవడంతో దీనిపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు లబ్ధి చేకూర్చేందుకే ఆ ధర నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలవలస లేఅవుట్‌కు ఆనుకొని అతనికి చెందిన లేఅవుట్‌ ఉండడంతో వాటికి మంచి ధర రప్పించేందుకు కొందరు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ధర తగ్గింపు ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.

784 రేషన్‌ కార్డుల మంజూరు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే ఈ ఏడాది జూన్‌ 16వ తేదీ నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు 784 రేషన్‌కార్డ్డులు (రైస్‌ కార్డులు) మంజూరయ్యాయి. వాటితోపాటు 739 స్ల్పిట్‌ కార్డుల మంజూరుకు ఆమోదం పొందినట్లు ప్రభుత్వ డ్యాష్‌బోర్డులో పేర్కొన్నారు.  విశాఖ జిల్లాకు మంజూరైన ఆయా కార్డులను త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసి మంజూరు కోసం నగర వాసులు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని