logo

ఉద్యోగి ఉక్కిరిబిక్కిరి

తమిళనాడుకు చెందిన యువ ఐపీఎస్‌ అధికారి శశికుమార్‌ పాడేరు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈయన విధుల్లో చురుగ్గా వ్యవహరించేవారు.

Updated : 09 Dec 2022 06:30 IST

పథకాల వారీగా లక్ష్యాలతో సతమతం
ప్రాణాల మీదకొస్తున్న పని ఒత్తిడి

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: తమిళనాడుకు చెందిన యువ ఐపీఎస్‌ అధికారి శశికుమార్‌ పాడేరు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈయన విధుల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అప్పట్లో ఏజెన్సీ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుండడంతో దీనిపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఆయన తన కార్యాలయంలో పిస్తోల్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రెండేళ్ల కిందట ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రామ్‌ప్రసాద్‌ పని ఒత్తిడి కారణంగా తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. తాగునీటి పథకాల లక్ష్యాలను చేరుకోలేపోతున్నానని, సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే ఆవేదనే ఆయన ఊపిరి తీసింది. తాజాగా పెదబయలు మండలం తహసీల్దారు శ్రీనివాసరావు గురువారం ఉదయం తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పని ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు సహచరులు చెబుతున్నారు.

ఓవైపు కార్యాలయ విధులు.. మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు.. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. వీటన్నింటిపైనా వారానికి మూడు, నాలుగు రోజులు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు.. రోజూ రెండు, మూడుసార్లు టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లతో క్షణం తీరికలేకుండా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నుంచి జిల్లాస్థాయి కార్యాలయ అధికారుల వరకు అందరి పరిస్థితి ఇలానే ఉంది. రెండు రోజుల క్రితం జీవీఎంసీ పరిధిలోని వార్డు సచివాలయంలో పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శిగా పనిచేసిన చంద్రమోహన్‌ గుండెపోటుతో చనిపోయాడు. పనిఒత్తిడి.. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే చనిపోయాడని సహచర ఉద్యోగులంతా జీవీఎంసీ ఎదుట నిరసన తెలిపారు. తాజాగా పెదబయలు మండలం తహసీల్దారు ఆత్మహత్య ఉదంతంతో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

రెవెన్యూపైనే ఎక్కువ..

జగనన్న భూసమగ్ర సర్వే కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎంతో పక్కాగా చేపట్టాల్సిన భూముల రీసర్వేకు గడువు తేదీలను నిర్ణయించి ఆలోగా సర్వే పూర్తిచేయించాలని లక్ష్యాలు విధిస్తున్నారు. చేయనివారికి షోకాజ్‌ నోటీసులిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా ఉమ్మడి జిల్లాలో వీఆర్వోలు, సర్వేయర్లు, తహసీల్దార్లు రాత్రీ పగలు తేడాలేకుండా పనిచేస్తున్నారు. కొంతమంది ఇళ్లకు కూడా వెళ్లకుండా కార్యాలయాల్లోనే రోజులు తరబడి గడుపుతున్నారు. ఇటీవల రోలుగుంట మండలంలో క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలంటూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.. ఆయన కూడా వారితో సమానంగానే పనిచేస్తున్నారు. ఓ వైపు భూముల సర్వేలు చేస్తూనే కార్యాలయంలో మిగతా పనులు, మ్యుటేషన్లు, స్పందన ఫిర్యాదుల పరిష్కారాలు ఏకకాలంలో చేయాల్సి రావడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెదబయలు తహసీల్దారు శ్రీనివాసరావు కూడా భూముల సర్వేకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో అధికారుల మందలింపునకు గురయ్యానని, కిందిస్థాయి సిబ్బంది కూడా సహకరించడం లేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచరులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు అందుకున్నారు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఎస్‌.రాయవరం తహసీల్దారును రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. మరో ముగ్గురు తహసీల్దార్ల పనితీరు బాగోలేదని ఇటీవల జిల్లా ఉన్నతాధికారే సమీక్షా సమావేశంలో చెప్పడంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మిగతా శాఖల్లోనూ టార్గెట్లు..

* జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు తక్కువగా ఉన్న చోట గృహనిర్మాణ సిబ్బంది, అధికారులపైనా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శనివారం హౌసింగ్‌ డే పేరుతో పురోగతిని చూపించకుంటే తాఖీదులిస్తున్నారు.
*జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో ఇంటింటా కుళాయి పనులకు లక్ష్యాలను విధించారు. టార్గెట్లు చేరుకోని వారికి వారం వారం సమీక్షలు నిర్వహించి వివరణ కోరుతున్నారు.
* పంచాయతీరాజ్‌ శాఖలో సచివాలయాలు, ఆర్బీకే, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణాలకు లక్ష్యాలు విధించారు. వారాంత సమీక్షలో ఎస్‌ఈ నుంచి ఏఈ వరకు పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి మందలింపులు వస్తున్నాయి. బీ నాడు-నేడు పనులకు టార్గెట్లు పూర్తి చేయనివారికి శ్రీముఖాలు జారీ చేస్తున్నారు. బీ పాఠశాలల్లో యాప్‌లను నిర్వహించకపోయినా.. ముఖ హాజరు నమోదు చేయకపోయినా ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేస్తున్నారు.
* ఇలా వివిధ శాఖల్లో పెట్టే టార్గెట్లు తట్టుకోలేక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళుతుంటే, మరికొందరు వీఆర్‌ఎస్‌ బాట పడుతున్నారు. సున్నిత మనస్కులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.


విలపిస్తున్న శ్రీనివాసరావు భార్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని