logo

రూ. 100 కోట్లు... వచ్చేనా?!

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి శతాబ్ది నిధులు వస్తాయా? రావా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Published : 19 Jan 2023 03:43 IST

ఎదురు చూస్తున్న ఏయూ

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయానికి శతాబ్ది నిధులు వస్తాయా? రావా? అన్నది చర్చనీయాంశంగా మారింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) వందేళ్లు పూర్తి చేసుకోబోయే విశ్వవిద్యాలయాలకు రూ.వంద కోట్లను కేటాయిస్తుంటుంది. నాలుగేళ్ల నుంచి కేంద్రం ఈ నిధులను ఏ విశ్వవిద్యాలయానికీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా   ఏయూకు నిధులు దక్కుతాయా, లేదా అన్నది తేలాల్సి ఉంది.

భవనాలు శిథిలావస్థలో: ఏయూలో 458 భవనాలున్నాయి. వాటిలో 229 శిథిలావస్థలో ఉన్నట్లు ఇప్పటికే తేల్చారు. 225 భవనాలు నిర్మించి  60 ఏళ్లు దాటింది. వీటిలో అత్యధిక భవనాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తూ వస్తున్నారు. కొన్ని కూలిపోయే ముప్పు కూడా ఉంది. వందలాది మంది విద్యార్థులు ఉంటున్న కొన్ని వసతిగృహాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా అదనపు భవనాలు లేక వాటితోనే కాలం గడిపేస్తున్నారు. నిపుణులైన ఇంజినీర్లు భవనాల సామర్థ్యాన్ని శాస్త్రీయంగా పరిశీలించి అవి ఏ మేరకు అనుకూలమో తేల్చాల్సి ఉన్నా...ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కొన్ని భవనాల గోడలపై మొక్కలు మొలుస్తున్నా, పిచ్చి మొక్కల పొదలు భవనాల మీదికి ఎగబాకుతున్నా పట్టించుకునేవారే లేరు. యూజీసీ నిధులు వస్తే ఈ భవనాల పునరుద్ధరణకైనా ఉపయోగపడేవని పలువురు పేర్కొంటున్నారు.


అలా రూ.వెయ్యి కోట్లు చేజారాయి..

‘ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’(ఐ.ఒ.ఇ.)గా కొన్ని సంస్థలను యూజీసీ ఎంపిక చేసింది. ఆ హోదాకు పోటీపడటంతో దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న ఏయూకు గుర్తింపు వస్తుందని భావించారు. ఊహించని విధంగా ఆఖరు నిమిషంలో ఎంపిక ప్రక్రియను మార్చడంతో ఏయూకు అందివచ్చిన అవకాశం చేజారింది. ఆ హోదా వస్తే యు.జి.సి. ఏకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించి... ఏయూను అంతర్జాతీయస్థాయిలో  అభివృద్ధి చేసేది. ఆ వెయ్యికోట్ల రూపాయలు దక్కించుకోలేదన్న బాధ నుంచి తేరుకోకముందే తాజాగా రూ.100 కోట్ల నిధులు కూడా దక్కుతాయో? లేదో? అన్న ఆందోళన నెలకొంది.


ప్రజా సంక్షేమానికి తపించిన ఎన్‌టీఆర్‌

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ ప్రజల సంక్షేమానికి ఎంతో తపించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగర తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యేలు గంటా, వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండిబాబ్జి తదితరులను చిత్రంలో చూడొచ్చు.

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు