logo

‘ప్రజలపై భారం వేస్తే విద్యుత్తు ఉద్యమమే’

కార్పొరేట్ సంస్థల లాభాల కోసం విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే విద్యుత్తు ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

Published : 20 Jan 2023 03:20 IST

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తితో మాట్లాడుతున్న సీఐ సింహాద్రినాయుడు

గురుద్వారా, న్యూస్‌టుడే: కార్పొరేట్ సంస్థల లాభాల కోసం విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే విద్యుత్తు ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. విద్యుత్తు ఛార్జీలపై పెంపుపై గురుద్వారా దరి ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన నేపథ్యంలో వామపక్షాలు అక్కడ నిరసన వ్యక్తం చేశాయి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని 89 లక్షల నివాసగృహాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలన్నింటికీ 2025 మార్చిలోపు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు పెట్టాలనే ప్రతిపాదనను తప్పుపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతి వచ్చినా.. ప్రత్యక్ష సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించారు. రూ.13వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేయాలన్న నిర్ణయం సరికాదన్నారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేస్తే వినియోగదారులపై వేల కోట్లలో భారం అదనంగా పడుతుందని స్పష్టం చేశారు.  ఒక్కో మీటరుకు రూ.వేలు  చెల్లించి విద్యుత్తును వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ద్వారకా పోలీస్‌స్టేషన్‌ సీఐ సింహాద్రినాయుడు నిరాకరించారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు వారికి సర్దిచెప్పడంతో కొద్ది సమయం నిరసన తెలిపి వెనుదిరిగారు. నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.

* అభిప్రాయ సేకరణలో ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్దన్‌రెడ్డిలు సంస్థల పరంగా అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాలను చదివి వినిపించారు. 57 మంది మాట్లాడేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి రోజు 20 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను, సూచనలు తెలియజేశారు. వ్యవసాయానికి స్మార్ట్‌మీటర్లు వద్దని, వ్యవసాయ మీటర్ల మంజూరులో జాప్యం,  ఆర్థికలోటు పేరుతో వినియోగదారులపై భారం వంటి వాటిపై పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఏపీఆఈఆర్సీ కమిషన్‌ కార్యదర్శి కె.రాజబాపయ్య, మూడు విద్యుత్తు పంపిణీ సంస్థల డైరక్టర్లు, ఎస్‌ఈ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

*  వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అనకాపల్లి జిల్లా సీపీఐ నాయకులు రాజాన దొరబాబు ఈఆర్సీ ఛైర్మ్‌న్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 2019-20లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటి వరకు కనెక్షన్లు ఇవ్వలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని