logo

‘ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా’

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధానులను మారుస్తారా అని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనరు గద్దె తిరుపతిరావు వ్యాఖ్యానించారు.

Published : 20 Jan 2023 03:20 IST

పాదయాత్ర చేస్తున్న అమరావతి ఐకాస కో కన్వీనరు తిరుపతిరావు

తగరపువలస, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధానులను మారుస్తారా అని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనరు గద్దె తిరుపతిరావు వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర కొద్దినెలల కిందట ఆగిన నేపథ్యంలో ఈయన ఒక్కరే దానిని పూర్తి చేసేందుకు ఇటీవల రామచంద్రాపురం నుంచి తిరిగి చేపట్టిన పాదయాత్ర గురువారం విశాఖలోని తగరపువలసకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడి సంగివలస పోలమాంబ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి మాట్లాడారు. దాదాపు రూ.10వేల కోట్లతో రాష్ట్ర రాజధాని పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాజధానిని మార్చరాదని న్యాయవ్యవస్థ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అనివార్య కారణాలతో రామచంద్రాపురంలో ఆగిన రైతుల పాదయాత్రను తాను కొనసాగించే సంకల్పంతో తొమ్మిది రోజుల కిందట తిరిగి ప్రారంభించానన్నారు. విశాఖలోని మధురవాడ నుంచి గురువారం తెల్లవారుజామున నడక ప్రారంభించానని రోజుకు సగటున 25 నుంచి 30 కిలోమీటర్ల మేర నడిచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి చేరుకుంటానన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పోవాలని, పరిశ్రమలు రావాలని, దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ ఉండాలని అరసవల్లి సూర్యనారాయణమూర్తిని తాను కోరుకుంటానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని