ఎంతుండాలి.. ఎంతుంది? ఎవరికీ తెలీని ఎర్రచెరువు లెక్క
అది కొత్తూరు పంచాయతీ భవనానికి ఎదురుగా ఉన్న ఎర్రచెరువు.. తుమ్మపాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 613/2లో 16.77 ఎకరాలు ఉన్నట్లు పంచాయతీ రికార్డుల్లో ఉంది.
ఆక్రమణలకు తోడు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే
అది కొత్తూరు పంచాయతీ భవనానికి ఎదురుగా ఉన్న ఎర్రచెరువు.. తుమ్మపాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 613/2లో 16.77 ఎకరాలు ఉన్నట్లు పంచాయతీ రికార్డుల్లో ఉంది. చెరువు విస్తీర్ణం ఇప్పుడు ఎంత ఉందో అటు రెవెన్యూ అధికారులకు... ఇటు పంచాయతీ అధికారులు చెప్పలేని దుస్థితి.. కారణం చెరువు ఆక్రమణలకు గురవ్వడం.. ఇటీవల కాలంలో చెరువు ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులు కట్టడాలు కడుతుంటే రెవెన్యూ అధికారులు అడ్డుకుని బోర్డులు పెట్టారు.. చెరువును ఆక్రమించి ప్రభుత్వ భవనాలు కడుతుంటే మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇలా మౌనంగా చూస్తూ ఊరుకుంటే ఈ ప్రాంతంలో ఎర్రచెరువు అనేది ఒకటి ఉండేది అని ముందు తరాల వాళ్లు చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎర్రచెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు. ఎన్నికలో గెలిచిన వెంటనే దీన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడికి సమీపంలో డంపింగ్ యార్డు ఉండేది. దీన్ని కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు తొలగించారు. దీంతో ఈ ప్రాంతీయులకు దుర్వాసన నుంచి విముక్తి లభించింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసి, బోటు షికారు పెట్టి దీన్ని ఆధునికీకరించేలా పనులు చేస్తామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. అయితే కరోనా విజృంభణతో పనులపై దృష్టి సారించలేదు.
*ఎర్రచెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో చేపడతామని దీనికి తహసీల్దార్ అనుమతి కోరుతూ పంచాయతీ ప్రతిపాదించింది. ఈమేరకు గత ఏడాది అక్టోబరు 7న సర్పంచి లక్ష్మీప్రసన్న పేరుతో పంచాయతీ తీర్మానం చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోగా ఎర్రచెరువు ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్డు ఆదేశాల ప్రకారం చెరువులను మట్టితో కప్పి ఆక్రమణలు చేయకూడదు. డీఎస్పీ కార్యాలయం ఆధునికీకరణ పేరుతో చెరువును మట్టితో కప్పి విశాలం చేస్తున్నారు. కార్యాలయానికి పక్కగా వాహనాల పార్కింగ్ కోసం చెరువును మట్టితో కప్పేసి చదును చేశారు. ఇలా ఒక్కో కార్యాలయాన్ని చెరువు స్థలంలో నిర్మించడం, విస్తరించడం చేసుకుంటూ పోతే చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనేది స్థానికుల వాదన.
చుట్టూ ప్రభుత్వ భవనాలే
చెరువు చుట్టూ ప్రభుత్వ భవన నిర్మాణాలే ఉన్నాయి. ఎకరంన్నర స్థలంలో ఆర్డీవో కార్యాలయాన్ని నిర్మించారు. అయితే అప్పట్లో భూమార్పిడి కింద జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని చెరువు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారు. ఇటీవల ఇక్కడ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఇప్పుడు డీఎస్పీ కార్యాలయాన్ని ఆధునికీకరణ పేరిట చెరువు స్థలంలో
విస్తరిస్తున్నారు.
కొరవడుతున్న పర్యవేక్షణ
చెరువు కింద ఆయకట్టు ఉంటే జలవనరుల శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చెరువుకు ఆయకట్టు లేదు. దీంతో పర్యవేక్షణ బాధ్యత రెవెన్యూ సిబ్బంది చేపట్టాల్సి ఉంది. వీరు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తే పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి అభివృద్ధి చేస్తామని చేసిన పంచాయతీ తీర్మానానికి రెవెన్యూ శాఖ నుంచి అనుమతి ఇవ్వాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు చెరువు భూమి పరిరక్షణపై దృష్టి పెట్టాలని స్థానికులు సూచిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి చెరువు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
చెరువులను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఎర్రచెరువు ఆక్రమణలకు గురవుతోందని మా దృష్టికి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తే నోటీసులు ఇచ్చి నిర్మాణాలు ఆపించాం. ప్రభుత్వ భననాల నిర్మిస్తున్న విషయంపై పరిశీలన చేసి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.
గంగాధరరావు, తహసీల్దార్, అనకాపల్లి
నోటీసులు ఇస్తున్నాం
చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేసేవారికి నోటీసులు ఇస్తున్నాం. ప్రభుత్వ భవనాల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం. చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం నేరం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసి సంరక్షించేందుకు రెవెన్యూ అధికారుల అనుమతి కోరుతూ పంచాయతీ తీర్మానం పంపాం. అనుమతి వస్తే వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసి చెరువు సంరక్షణతో పాటుగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
రమాకుమారి, కొత్తూరు పంచాయతీ కార్యదర్శి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!