logo

అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో వసతులేవీ..

ఆనందపురం మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో భీమిలి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున శుక్రవారం తొలిసారిగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు

Updated : 21 Jan 2023 07:14 IST

ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సమావేశంలో మాట్లాడుతున్న భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు, పక్కన కలెక్టర్‌ మల్లికార్జున

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో భీమిలి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున శుక్రవారం తొలిసారిగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో కలిపి ఈ సమావేశం నిర్వహించడంతో అధికార యంత్రాంగంలో గందరగోళం కన్పించింది. అజెండా అంశాల మేరకే సమీక్షించినా ఆర్థికాంశాలతో ముడి పడినవి కావడం, క్షేత్రస్థాయి ఇబ్బందులు, నిధుల సమీకరణ, గుత్తేదారుల సమస్యలు, టెండర్లు వేయకపోవడం వంటి వాటికి అధికారులు సమాధానం ఇవ్వడంలో సమన్వయలోపం కన్పించింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూమి పూజ చేసిన పనుల్లో ఇంతవరకు పురోగతి లేదని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల ఏర్పాటుకు పెండింగ్‌లో ఉన్న టీడీఆర్‌లు మూడు వారాల్లో మంజూరు చేయాలని సూచించారు. తగరపువలస, భీమిలి ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి గోస్తనీ నది నుంచి వేసిన పైపులైను నిలిచిపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాండ్రంగి వంతెన టెండర్‌ విషయంలో జాప్యంపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ..చిల్లపేట చెరువు జలవనరుల శాఖ నుంచి వేరు చేస్తే దివీస్‌ కంపెనీ సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి చేయవచ్చునన్నారు. భీమిలి బీచ్‌లో ఆశించిన మేరకు వసతులు లేవని, లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో సరైన పార్కులు, కల్యాణ మండపాలు, శ్మశాన వాటికలు లేవని ఎమ్మెల్యే సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు వై.సూర్యనారాయణ, జోన్‌ 1, 2 అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని