logo

తేలుతుంది.. కాలుష్యం లెక్క తేలుస్తుంది!

సముద్ర జలాలు వేగంగా కలుషితమవుతున్నాయి. నగరంలోని మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు ప్రతిరోజు భారీగా కలుస్తున్నాయి.

Published : 25 Jan 2023 04:56 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే

సముద్ర జలాలు వేగంగా కలుషితమవుతున్నాయి. నగరంలోని మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు ప్రతిరోజు భారీగా కలుస్తున్నాయి. ఫలితంగా ఆ జలాల్లోని మత్స్యసంపద మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. సముద్ర జలాల్లో ఆక్సిజన్‌ స్థాయిలు కూడా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌’ చర్యలు చేపట్టింది. ‘రియల్‌ టైమ్‌ వాటర్‌ క్వాలిటీ డేటా బూయి’ ప్రాజెక్టును విశాఖకు మంజూరు చేసింది.

రూ.1.85 కోట్లు:

ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లోని మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇందుకు రూ.1.85 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టును ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆచార్య జానకీరామ్‌ ఆధ్వర్యంలో ఎం.కె.కడంగ (శాస్త్రవేత్త), లోవరాజు (సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో), మరో ఇద్దరు ప్రాజెక్టు అసోసియేట్‌లు నిరంతరం పర్యవేక్షిస్తారు.

ఇది మూడో ప్రయోగ యంత్రం

డేటా బూయిలను ఇంతవరకు చెన్నై, పుదుచ్ఛేరిలో ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది మూడోది. వీటి ద్వారా అందే ఫలితాలను అనుసరించి తూర్పు తీరం, పశ్చిమ తీరంలో మరిన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సముద్రంలో లంగరు

ఆర్‌.కె.బీచ్‌కు ఎదురుగా సముద్ర జలాల్లో ‘డేటా బూయి’ యంత్రాన్ని లంగరు వేశారు. ఇది సాగర జలాలపై  తేలియాడుతుంది. దీనికి సెన్సార్లు ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒకసారి నీటి నాణ్యతను పరిశీలించి ఏయూలోని మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌ (ఎం.ఎల్‌.ఆర్‌)కు పంపిస్తుంది. అక్కడి సిబ్బంది ఈ సమాచారాన్ని విశ్లేషించి ఫలితాలను రికార్డు చేస్తారు. ఈ నివేదికను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌’కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ (ఎన్‌.సి.సి.ఆర్‌)కి పంపిస్తారు.

ఎంతో ఉపయోగం..

ఈ ప్రాజెక్టు ఏయూకు రావడం మంచి పరిణామం. దీన్ని సాధించడానికి వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సముద్ర జలాల్లో కలుషితాలను గుర్తించి... నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మానవులతో పాటు సమస్త జీవరాశి, పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఇది అందించే సమాచారంతో సముద్రంలో నీటి శుభ్రతపై చర్యలు తీసుకొనేందుకు వీలు కలుగుతుంది.

ఆచార్య జానకీరామ్‌, ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, రియల్‌ టైమ్‌ వాటర్‌ క్వాలిటీ డేటా బూయి ప్రాజెక్టు, ఏయూ

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు