logo

రండి.. కదలిరండి.. ఓటు హక్కుకు..!

ప్రజాస్వామ్య సౌధానికి ఓటు మూల స్తంభమని రాజ్యాంగ కర్తలు 70 ఏళ్ల కిందటే ఉద్బోధించారు. అర్హుడైన ప్రతి పౌరుడికి ఆ హక్కు ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.

Published : 25 Jan 2023 04:56 IST

నేడు జాతీయ ఓటరు దినోత్సవం

యువ ఓటర్లు

ప్రజాస్వామ్య సౌధానికి ఓటు మూల స్తంభమని రాజ్యాంగ కర్తలు 70 ఏళ్ల కిందటే ఉద్బోధించారు. అర్హుడైన ప్రతి పౌరుడికి ఆ హక్కు ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఓటు అమూల్యమైంది..వజ్రాయుధంతో సమానమని అంటారు. అర్హులైన వారు దాన్ని పొందక పోయినా.. సద్వినియోగం చేసుకోకపోయినా ప్రజాస్వామ్యం మనజాలదని, నిరంకుశులు రాజ్యమేలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో గత నాలుగేళ్ల కాలంలో ఓటర్ల పెరుగుదల..కొత్తగా ఓటర్ల నమోదు తీరుపై కథనం..

* జాతీయ ఓటరు దినోత్సవాన్ని బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఓటరు నమోదుపై ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. సిరిపురం కూడలి నుంచి వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. యువ ఓటర్లు 50 మందికి ఓటరు ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఈఆర్‌ఓ (ఎలక్ట్రోరల్‌ రిటర్నింగ్‌ అధికారి), ఇద్దరు బీఎల్‌ఓ(బూత్‌ లెవల్‌ అధికారి)లను ఎంపిక చేసి సత్కరించనున్నారు. ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది.

యువ ఓటర్ల నమోదు అంతంతే: జిల్లాలో యువ ఓటర్ల పేర్లు నమోదు అంతంత మాత్రంగానే సాగుతోంది. అధికార వర్గాల అంచనా ప్రకారం 18,19 ఏళ్ల వయస్సు ఉన్న యువ ఓటర్లు 94,185 మంది ఉంటారని అంచనా. అయితే ఇంత వరకు కేవలం 16,494 మంది మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల జరిగిన సంక్షిప్త ఓటరు నమోదు ప్రక్రియలో కళాశాల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఫలితంగా 12,378 మంది ఓటర్లుగా చేరారు. ఇంకా 78 వేల మంది ముందుకు రావాల్సి ఉంది. భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా 2968 మంది యువ ఓటర్లు ఉంటే అత్యల్పంగా విశాఖ దక్షిణంలో 549 మంది ఉన్నారు.

జిల్లాలో తగ్గుతున్న ఓటర్లు: జిల్లాలో క్రమంగా ఓటర్లు తగ్గుతున్నారు. 2019లో 16,49,904 మంది ఓటర్లు ఉంటే 2023 నాటికి 18,96,043కు చేరాయి. 2020, 2021, 2022లో పెరిగి, 2023 నాటికి తగ్గారు. 2023లో 70వేల వరకు డబుల్‌ ఎంట్రీ పేర్లను జాబితాలను తొలగించారు. కేవలం 15వేల మంది మాత్రమే కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య తగ్గింది.

నత్తనడకన ఆధార్‌ అనుసంధానం..

జిల్లాలో ఓటరు-ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏడాది క్రితం ఈ ప్రక్రియను యంత్రాంగం ప్రారంభించింది. దీని వల్ల పలు ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా డూప్లికేటు ఓట్లను నివారించవచ్చు. ఆధార్‌ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని చెప్పడంతో అధిక శాతం ముందుకు రావడం లేదు. ఒక వేళ ఆధార్‌ వివరాలు ఇవ్వకుంటే బీఎల్‌ఓలు ఎన్నికల సంఘం గుర్తించిన పది గుర్తింపు పత్రాల్లో (పాసుపోర్టు, ఓటు కార్డు, కార్యాలయ గుర్తింపు కార్డు, బియ్యం కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితరాల్లో) ఏదో ఒకటి సేకరించాలని నిర్దేశించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 18,96,043 మంది ఓటర్లు ఉంటే కేవలం 45.30శాతం మంది నుంచి మాత్రమే ఆధార్‌ వివరాలను సేకరించారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు