logo

వచ్చేదెలా.. ఉండేదెలా!!

నగర పరిధిలోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయా నివాస సముదాయాల్లో సదుపాయాలు కల్పించకపోవడంతో సగం మంది కూడా నివాసం ఉండడం లేదు.

Published : 26 Jan 2023 05:28 IST

టిడ్కో గృహాల్లో అసౌకర్యాలపై ఆవేదన
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

గాజువాక వికాస్‌నగర్‌లోని టిడ్కో ఇళ్లు

నగర పరిధిలోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయా నివాస సముదాయాల్లో సదుపాయాలు కల్పించకపోవడంతో సగం మంది కూడా
నివాసం ఉండడం లేదు. ఫలితంగా పేదలకు సొంతింటి కల సుదూరంగానే ఉండిపోతోంది.

మరో వైపు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా రూ.35వేలు చెల్లించాల్సి రావడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

టిడ్కో (టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట కార్పొరేషన్‌) పథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం నగరంలోని పేదలకు 24,192 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్ల క్రితం దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి.

* తర్వాత వైకాపా ప్రభుత్వం రావడంతో వాటిని పట్టించుకోలేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో మూడు నెలల క్రితం 4,500 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఏర్పాటు చేసిన జీవీఎంసీ యూసీడీ అధికారులు 2,609 ఇళ్లకు సంబంధించిన పట్టాలు అందజేశారు. ఆయా ఇళ్లకు ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో కేవలం 1,345 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి.

97వేల ఇళ్లు మంజూరు..

విశాఖలో అర్హులైన పేదలకు 97వేల ‘టిడ్కో’ ఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికి 24,192 మందికి గృహాలు అందుబాటులో ఉండగా, మరికొంత మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో లేఅవుట్లను ఏర్పాటు చేసి వేల మందికి స్థలాలను గుర్తించారు. ఆయా వివరాలను కేంద్రానికి తెలియజేయడంతో 97 వేల ఇళ్ల నిర్మాణానికి అంగీకరించింది.

ముదపాకలో పునాదుల దశలో...

నిధుల వేటలో లబ్ధిదారులు: అందరికీ ఇళ్లు పథకంలో ఎంపిక చేసిన 97వేల మంది తమ వాటాగా ఒక్కొక్కరు రూ.35వేలు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబితే మహిళా సంఘాల ద్వారా రుణాలను తీసుకునే వెసులుబాటు కల్పించారు. మహిళా సంఘాల ద్వారా ఇంత వరకు 9,067 మంది రుణాలు తీసుకుని ఆయా నిధులు చెల్లించారు. మరో 28వేల మందికి రుణాలు ఇవ్వాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. మిగతా వారు తమ సొంత నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.1.80 లక్షల చొప్పున కేటాయించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ యూసీడీ సిబ్బంది లబ్ధిదారులకు చెప్పి వారి వాటా చెల్లించాలని కోరుతున్నారు. అయితే ఆయా నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళుతున్నాయా లేదా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుకు వెళుతుందా అనే అంశంపై స్పష్టత లేదు.

ఎప్పటికి పూర్తవుతాయో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్‌ ప్రతి శనివారం జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలించి నివేదిక పంపించాల్సి ఉంటుంది. దీంతో కమిషనర్‌ రాజాబాబు జగనన్న కాలనీలకు వెళ్లి ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారులతో మాట్లాడి ఇళ్ల పురోగతి తెలుసుకుంటున్నారు. నగర పరిధిలో ఇప్పటికింకా పునాదుల దశలోనే ఇళ్ల నిర్మాణాలు ఉండటంతో ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని