logo

కుమార్తెను కాపాడి.. క్షణాల్లోనే ప్రాణాలొదిలి..

వల్సంపేట జలపాతం(గాదిగుమ్మి)లో అప్పటివరకు కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. ఫొటోలు తీసుకుంటున్న సమయంలో తన కుమార్తె జలపాతంలోకి జారిపోబోయింది.

Published : 27 Jan 2023 03:11 IST

జలపాతంలో పడి నేవీ విశ్రాంత ఉద్యోగి మృతి

సుబ్బరాజు (పాత చిత్రం)

కొయ్యూరు, న్యూస్‌టుడే: వల్సంపేట జలపాతం(గాదిగుమ్మి)లో అప్పటివరకు కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. ఫొటోలు తీసుకుంటున్న సమయంలో తన కుమార్తె జలపాతంలోకి జారిపోబోయింది. పాపను కాపాడి కొద్దిక్షణాల్లోనే ఆ తండ్రి దురదృష్టవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. తలకు తీవ్ర గాయమవడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం వేపగుంట దరి పురుషోత్తపురానికి చెందిన మంతెన సుబ్బరాజు (41) నేవీలో పని చేస్తూ గతేడాది ఉద్యోగం విరమణ పొందారు. ఆ తర్వాత ఓ బీమా కంపెనీలో చేరారు. ఆయనకు భార్య శిరీష, కుమారుడు కార్తీక్‌, కుమార్తె లాస్య ఉన్నారు. ఓ వివాహానికి బుధవారం రాత్రి నర్సీపట్నం వచ్చారు. గురువారం కొయ్యూరు మండలంలోని వల్సంపేట జలపాతానికి కుటుంబసభ్యులు, స్నేహితుడు పి.శివశంకర్‌ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. జలపాతం అందాలను ఆస్వాదిస్తూ అక్కడే ఫొటోలు తీసుకొన్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె లాస్య జలపాతంలోకి జారిపోబోయింది. వెంటనే సుబ్బరాజు పాపను కాపాడినా.. కొద్దిక్షణాల్లోనే దురదృష్టవశాత్తు ఆయన కాలుజారి జలపాతం అగాధంలో పడిపోయారు. బండరాయిపై ఆయన పడటంతో తలకు తీవ్రగాయమై మృతి చెందారు. గానుగుల గ్రామానికి చెందిన ఈతగాళ్లు సుబ్బరాజు మృతదేహాన్ని బయటకు తీశారు. కొయ్యూరు ఎస్సై రాజారావు సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని