logo

ఈ బడి... ఏ క్షణమైనా రోడ్డున పడొచ్చు!!

ఒకే చోట ఉండాల్సిన ప్రాథమిక పాఠశాల వీధికొక ఇంట్లో కొనసాగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని పరిస్థితి గాజువాకలోనే నెలకొంది.

Updated : 28 Jan 2023 09:26 IST

ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరగతి
మధ్యాహ్న భోజనం తయారీ మరో చోట
న్యూస్‌టుడే, గాజువాక

అసంపూర్తిగా  ఉన్న పాఠశాల భవనం

ఒకే చోట ఉండాల్సిన ప్రాథమిక పాఠశాల వీధికొక ఇంట్లో కొనసాగుతోంది. జిల్లాలో ఎక్కడా లేని పరిస్థితి గాజువాకలోనే నెలకొంది. గాజువాక శివారు సింహగిరికాలనీ ప్రభుత్వ పాఠశాల శిథిల స్థితికి చేరడంతో భవనాన్ని ఆరు నెలల కిందట నేలమట్టం చేశారు. ‘నాడు- నేడు మనబడి పథకం’ రెండో దశలో రూ.24 లక్షలతో నూతన భవన నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే 115 మంది చిన్నారులకు ఎలాంటి ప్రత్యామ్నాయ వసతులు చూపకుండానే పనులు ప్రారంభించారు. నూతన భవనాన్ని పునాది నుంచి గోడల వరకు తీసుకొచ్చి వదిలేశారు. ప్రతిపాదిత నిధుల్లో కేవలం రూ.9 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు.

అంతా అయోమయం..

ఇంత మంది విద్యార్థులు, 5గురు ఉపాధ్యాయులు ప్రస్తుతం తలదాచుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో అదే భవనంలోని మొండి గోడలపై పరదాలు కట్టి 1, 2 తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు వంద మీటర్ల దూరంలో ఓ ఇంటి సెల్లారులో 3వ తరగతి, రోడ్డుకు అవతల వైపు ఉన్న మరో ఇంటి ఆవరణలో 4, 5 తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరికీ ఇంకో చోట మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి.. వాహనాలపై పిల్లల వద్దకు తీసుకొచ్చి వడ్డిస్తున్నారు.

* గట్టిగా వర్షం వచ్చినా, ఎండొచ్చినా 1, 2 తరగతుల పిల్లలు ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఇతర తరగతులు నిర్వహిస్తున్న ఇళ్ల యజమానులు ఎప్పుడు వెళ్లిపొమ్మంటే.. అప్పుడు పిల్లలంతా రోడ్డున పడాల్సి వస్తుంది.

* రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే కనిపిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం పరిశీలనలో భాగంగా పాఠశాల సందర్శనకు వచ్చిన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటలక్ష్మి, విద్యాశాఖ అధికారులు పాఠశాల తీరు తెన్నులు పరిశీలించి అవాక్కయ్యారు.

ఈ సమస్యపై పెందుర్తి మండల విద్యాశాఖ అధికారి పైడపునాయుడు వివరణ కోరగా... త్వరలోనే భవనం పనులు పూర్తి చేయించేలా జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు