logo

బెదిరింపులు.. హెచ్చరికలు!!

ఆనందపురం మండలంలో వివాదాస్పద భూములపై కొందరు నేతల కన్ను పడింది. వాటిని చేజిక్కించుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Updated : 28 Jan 2023 06:21 IST

వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్‌కు ఒత్తిళ్లు
ఆనందపురంలో నేతల ఇష్టారాజ్యం

ఈనాడు, విశాఖపట్నం

ఈ భూములకే నకిలీ పత్రాలు సృష్టించారు

ఆనందపురం మండలంలో వివాదాస్పద భూములపై కొందరు నేతల కన్ను పడింది. వాటిని చేజిక్కించుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖల్లోని పలువురు అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి...తీవ్రమైన ఆరోపణలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ భూమిని తాము చెప్పినట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని కొందరు ఒత్తిళ్లకు గురి చేసిన నేపథ్యంలో ఓ అధికారి తనను బదిలీ చేయాలని అధికారులకు విన్నవించుకోవడం గమనార్హం. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశారు.

ఆ లేఖలో..

‘నేను ఈ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తరువాత కొందరు స్థానికుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా. స్థిరాస్తి రంగంలోని కొందరు మధ్యవర్తులు, ఇతరులు వివాదాస్పద, కోర్టు వివాదాల్లోని భూములను తమకు రిజిస్ట్రేషన్‌ చేయాలని నిత్యం ఒత్తిళ్లు తెస్తున్నారు. పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. వాళ్లను నియంత్రించడం కష్టంగా ఉంది. అందుకే ఇక్కడి విధుల నుంచి నన్ను తప్పించి బదిలీ చేయండి’ అని ఈ మండలానికి చెందిన ఓ అధికారి గత ఏడాది లేఖలో విన్నవించుకున్నారు.

* ఇటీవల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని...మధ్యవర్తిగా ఉంచి గతంలో భూములు కొన్న వారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంతో ఆస్తులు కాజేయడం వెనుక కొందరి పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూమే అయినా..

ఆనందపురం మండలం గొట్టిపల్లిలో సర్వే నంబరు 24-3ఏలో కొంత భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ స్థలంగా ఉంది.  తప్పుడు వివరాలు నమోదు చేసి దీనిని విక్రయించే ప్రయత్నం చేశారు. 1బీ, ఎఫ్‌ఎంబీ పత్రాలను తామనుకున్నట్లు  సృష్టించారు. ఇదెలా జరిగింది అనే కోణంలో అధికారులు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. ఇటీవల ఆనందపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం   పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయకుండానే...ఆ ప్రక్రియ పూర్తయినట్లు నమ్మించి భూముల అమ్మకం పత్రాలు చేతిలో పెట్టిన ఘనుడి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సదరు నిందితుడు దస్తావేజులేఖరు కావడంతో గతంలో అతని ద్వారా జరిగిన   రిజిస్ట్రేషన్లపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని