logo

తప్పులతడకగా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ఆరోపించారు. 

Published : 28 Jan 2023 05:02 IST

అనర్హుల పేర్లూ చేర్చారు
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ

ఈనాడు, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ఆరోపించారు. శుక్రవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది డిసెంబరు 30న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో గుర్తించిన కొన్ని అభ్యంతరాలను వెల్లడించారు. అర్హత లేని అనేక మంది పేర్లను జాబితాల్లో కావాలనే చేర్చారని ఆరోపించారు. కొందరి పేర్లను సొంత మండలాల్లో కాకుండా...ఇతర మండలాల్లో చేర్చారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఇలా చేశారని విమర్శించారు. గతంలో విడుదల చేసిన బాబితాలో వేల తప్పిదాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో స్పందించి అనర్హులను తొలగించారు. అయినప్పటికీ సవరించిన జాబితాలో తప్పిదాలు ఉన్నాయన్నారు.    వీటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశామన్నారు.

*  ‘నిరక్షరాస్యులను...అలాగే అయిదో తరగతి, పది, ఇంటర్‌ విద్యార్హత ఉన్న వారినీ ఓటర్ల జాబితాల్లో చేర్చారు. బూత్‌ నంబరు 204లో 1285 వరుస సంఖ్యలోని ఓటరుకు తగిన విద్యార్హత లేదు.  బూత్‌ నంబరు 287లో 333 సంఖ్యలోని ఓటరు ఏడో తరగతి చదివారు. విశాఖ జిల్లాలో 1,752 మందికి డిగ్రీ విద్యార్హత లేదు. చాలా మంది పేర్లు రెండు, అంతకన్నా ఎక్కుసార్లు పొందుపరిచారు. విశాఖలోని బూత్‌ నంబరు 216లో ఒకరి పేరు అయిదుసార్లు నమోదు చేశారు. ఇలా 4,069 మంది పేర్లు ఒకటికంటే ఎక్కువసార్లు చేర్చినట్లు గుర్తించాం’ అని అజశర్మ పేర్కొన్నారు. ‘అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో బూత్‌ నంబరు 196లో ఇతర మండలాలకు చెందిన 62 పేర్లును గుర్తించాం. ఇందులో ఇతర జిల్లాలకు చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇదే బూత్‌లో క్రమసంఖ్య 1014లోని సుధారాణి ఈ బూత్‌కి 54 కి.మీ. దూరంలోని ఎల్‌.కోట మండలానికి చెందిన ఓటరు. క్రమసంఖ్య 1,009లో సీతమ్మధారకు చెందిన ఓటరు పేరు మునగపాకలో చేర్చారు’ అని కొన్ని ఉదాహరణలను అజశర్మ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని