logo

‘జీ-20 పేరుతో రూ.150 కోట్ల దుర్వినియోగం’

నగర సుందరీకరణ పేరుతో అవినీతికి తెరలేపారని, జీ-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో నగరంలో రహదారుల నిర్మాణం, వీధిలైట్లు, పెయింటింగ్స్‌, మొక్కలు నాటే కార్యక్రమం..ఇలా చెబుతూ రూ.150కోట్లు ఖర్చు చేయనున్నట్లు సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనర్‌ చెబుతున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

Published : 28 Jan 2023 05:02 IST

మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ తదితరులు

సీతంపేట, న్యూస్‌టుడే : నగర సుందరీకరణ పేరుతో అవినీతికి తెరలేపారని, జీ-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో నగరంలో రహదారుల నిర్మాణం, వీధిలైట్లు, పెయింటింగ్స్‌, మొక్కలు నాటే కార్యక్రమం..ఇలా చెబుతూ రూ.150కోట్లు ఖర్చు చేయనున్నట్లు సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనర్‌ చెబుతున్నారని జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. శ్రీనగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలు రూప, శ్రీనివాస పట్నాయక్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. జీ 20 సదస్సు వల్ల విశాఖ నగరానికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. సాక్షాత్తూ జీవీఎంసీ కమిషనరే అప్పూఘర్‌ ఎదురుగా సముద్రం ఒడ్డును సహజ సిద్ధంగా ఉన్న ఇసుక మేటలు, ఇసుక తెన్నులన్నింటినీ, మూగజీవులు ఉండే ప్రదేశాన్ని జేసీబీలు పెట్టి తొలగిస్తున్నారన్నారు. ప్రతినిధులు ప్రకృతి విధ్వంసం చూడటానికి వస్తున్నారా? విశాఖ నగర అందాలను చూడటానికి వస్తున్నారా? ఎవరి ఖజానా నింపేందుకు ఈ పనులు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీ20కోసం చేస్తున్న ఖర్చులకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించాలన్నారు. ఇంత నిధులు జీవీఎంసీ నుంచి ఖర్చు చేస్తున్నపుడు ఎందుకు ఒక సమావేశమైనా జీవీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌, మేయర్‌ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఫిబ్రవరి 1న కౌన్సిల్‌ సమావేశం ఉందని, అజెండాలో ఒక్క అంశమైనా జీ20కి సంబంధించి లేకపోవడం దారుణమని అన్నారు. ఒక పక్క సుందరీకరణ పేరుతో రూ.కోట్లాది ఖర్చు చూపుతున్నారని, మరో పక్క ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వస్తే పచ్చదనం తొలగిస్తున్నారని, జీ20 పేరుతో సముద్ర తీరం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు