నిధులు నీళ్లపాలు..
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధిని గాలికొదిలేసింది.
నాణ్యత లేక గగ్గోలు
మునగపాక, న్యూస్‌టుడే
గణపర్తి వద్ద కుంగిన శారదా నది గట్టు
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధిని గాలికొదిలేసింది. ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనిని పరిశ్రమ సామాజిక బాధ్యత కింద చేపట్టింది. పోనీ.. ఆ పనులనైనా అధికారులు సక్రమంగా పర్యవేక్షిస్తున్నారా అంటే అదీలేదు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో నిర్మించిన మూడు మాసాలకే కుంగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ మునగపాక మండలం గణపర్తి వద్ద శారదా నది ఎడమగట్టు నిలుస్తుంది. సుమారు రూ.కోట్లతో నిర్మించిన శారదానది గట్టు మూడు మాసాలకే కుంగిపోయింది.
గణపర్తి వద్ద శారదానది ఎడమగట్టు దశాబ్ద కాలంగా బలహీనపడింది. వర్షాకాలం వస్తే నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా గడిపేవారు. కోతకుగురైన గట్టుకు మూడేళ్ల క్రితం విశాఖ డెయిరీ నిధులు రూ.36 లక్షలతో మరమ్మతులు చేపట్టింది. అయితే ఏడాదికే అది కోతకు గురైంది. పక్కాగా సిమెంట్ కాంక్రీట్ గోడతో చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంతీయులు ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి, ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు దృష్టికి తీసుకెళ్లారు. జలవనరుల అభివృద్ధికి ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ ముందుకొచ్చింది. గత ఏడాది మార్చి నెలలో రూ.2.71కోట్ల నిధులు పరిశ్రమ కేటాయించింది. అంబుజా సిమెంట్ పరిశ్రమ ద్వారా పనులు చేపట్టారు.
నదిలోకి కుంగిన కాంక్రీట్ గోడ
ప్రారంభించిన మూడు నెలలకే..
ఆకర్షణీయంగా కనిపించేలా కొండరాతితో గట్టు పేర్చి మట్టితో గట్టును పూడ్చారు. గట్టుకి రెండు వైపులా మొక్కలు నాటారు. ఇలా పైకి అందంగా తీర్చిదిద్దిన ఈ శారదానది గట్టును గత ఏడాది అక్టోబరు 21న మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ప్రారంభించారు. చిరకాలంగా ఎదుర్కొంటున్న వరద సమస్య తలెత్తకుండా పక్కాగా గట్టును తీర్చిదిద్దామని ఘనంగా ప్రకటించారు. పట్టుమని మూడు మాసాలకే గట్టు పూర్తిగా కుంగిపోయింది. కాంక్రీట్‌గోడలు నదిలోకి ఒరిగిపోయాయి. గట్టుపైన నాటిన కొబ్బరిమొక్కలు బీటలలో కూరుకుపోయాయి. నిర్మాణాలు ఇలాగేనా ఉండేది అంటూ రైతులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని జల వనరుల శాఖ ఏఈ హనుమంతరావు వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా గ్రోయిన్‌లో ఎక్కువ కాలం నీరు నిల్వచేసి, ఒకేసారి దిగువకు వదలడం వల్ల గట్టు కింద మట్టి కొట్టుకుపోయి కుంగిపోయిందన్నారు. గట్టు దెబ్బతిన్న విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారి నిధులతోనే మళ్లీ పటిష్ఠపరుస్తామన్నారు.
ఆదిలోనే హెచ్చరించినా..
సిమెంట్ కాంక్రీట్ గోడల నిర్మాణం ఎలాంటి పునాదులు తీయకుండా పైపైనే చేపట్టారు. దీంతో నిర్మాణదశలోనే ఇవి బీటలు వారాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. నాణ్యతా లోపాలపై గత ఏడాది ఆగస్టు 18న ‘నిర్మాణ దశలోనే బీటలు’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. నిధులు వెచ్చించిన ఏషియన్ పెయింట్స్ యాజమాన్యం కూడా నాణ్యతలో శ్రద్ధ తీసుకోలేదు. ఇక జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. బీటలు వారిన సిమెంట్ గోడలపైనే నిర్మాణం చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: 175 స్థానాల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యం: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు