రూ. 75 కోట్ల పనులపై కన్ను!

విశాఖ నగరంలో మార్చిలో జి-20 సన్నాహక సదస్సులు... కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను చేజిక్కించుకునేందుకు కొందరు కన్నువేశా

Updated : 29 Jan 2023 06:30 IST

‘నామినేషన్‌ ముసుగు’లో ఏం జరగనుందో?!

విశాఖ నగరంలో మార్చిలో జి-20 సన్నాహక సదస్సులు... కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను చేజిక్కించుకునేందుకు కొందరు కన్నువేశారు. తమదైన రీతిలో సమాలోచనలు సాగిస్తున్నారు.

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌


నగర సుందరీకరణకు దాదాపు రూ.75 కోట్లలో పనులు చేపట్టనున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. మరో వైపు సదస్సుల సమయం దగ్గర పడుతున్నా... ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ వరకూ వెళ్లలేదు. కావాలనే తాత్సారం చేస్తూ చివరి నిమిషంలో నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించేలా పథకం రచిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఎక్కువ నిధులతో తక్కువ సమయంలో పనులు చేపట్టాలంటే పాలకవర్గ సమావేశాల్లో చర్చించాలి. అందుకు విరుద్ధంగా ఇటీవల ముగ్గురు పాలకవర్గ సభ్యులతో చర్చించి ముందుకు వెళుతున్నారంటూ పలువురు కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

* నగర ప్రజలు పన్నుల రూపేణా చెల్లిస్తున్న నిధులను జమ చేసుకుంటున్న ప్రభుత్వం గుత్తేదారులకు రూ.150 కోట్ల బకాయిలు నెలలు గడుస్తున్నా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు నిర్వహణకు రూ.75 కోట్లు ఎలా మంజూరు చేస్తుందనే సందేహం పలువురిలో వ్యక్తం అవుతోంది.

ఎవరికిస్తారో: సదస్సు నిర్వహణపై నెల రోజుల క్రితమే అధికారులకు సమాచారం ఉన్నా...ఇప్పటికీ ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవడం, టెండర్లు ఆహ్వానించకపోవడం వెనుక మంత్రాంగం ఏమిటనే ఆరోపణలు వస్తున్నాయి. రహదారులు, కాలువల అభివృద్ధికి రూ.40 కోట్లు, సుందరీకరణకు రూ.30 కోట్లు వ్యయం చేస్తామని కమిషనర్‌ ప్రకటించారు. జీ-20 సదస్సుకు వచ్చే అతిథులు ప్రయాణించే విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డు వరకు రహదారి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఇప్పటికే పచ్చదనం ఉంది. అయినా రూ.30 కోట్లు వ్యయం చేయడానికి ప్రతిపాదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై లేయర్లు వేయడం, కాలువల పునరుద్ధరణ వంటి పనులు చేయడానికి తక్కువ సమయం ఉండటంతో నామినేషన్‌ లేదా షార్ట్‌ టెండరు పిలిచి తమకు అనుకూలంగా ఉండే గుత్తేదారులకు పనులు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. సాగర్‌నగర్‌ తీర ప్రాంతం రహదారిలో మొక్కల కొమ్మలు తొలగించే పనులు చేస్తున్న గుత్తేదారుకు ఇంత వరకు వర్కు ఆర్డర్‌ కూడా రాలేదు. అయినా పనులు నిర్విరామంగా చేసేస్తుండటం గమనార్హం.


అలా పేర్కొంటూ..

జీ-20 సదస్సుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు జీవీఎంసీ ఖాతాలో జమ చేస్తుందని, గుత్తేదారులు పనులు చేస్తే బిల్లులు వేగంగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే... ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా చేపట్టిన పనుల బిల్లులు వెంటనే వస్తాయని అధికారులు చెప్పడంతో గుత్తేదారులు నగరంలో రూ.18 కోట్ల పనులు పూర్తి చేశారు. మరో రూ.15కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు ఇవ్వడానికి ప్రత్యేకమైన కోడ్‌ కేటాయించలేదు. దీంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు రూ.40 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.10 కోట్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు.


మాకు ఎలాంటి సమాచారం లేదు..

జీ-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై మాకెలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు మేయరు, కమిషనర్‌ సంప్రదించలేదు. కనీసం... అధికార పక్షంలోనే చాలా మంది కార్పొరేటర్లకు ఆ వివరాలు తెలియదు. కొంత మంది అధికారులు, పాలకవర్గ సభ్యులే కలిసి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. -పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌ లీడర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని