logo

ఉక్కు పోరాటం... మరో స్థాయికి!

మరో మాట లేకుండా...ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అలుపెరగని ఉద్యమాలతో...ఆ ప్రయత్నాన్ని ఆపుతామని కార్మికులు, ఉద్యోగులు పోరాటం సాగిస్తున్నారు.

Published : 29 Jan 2023 05:29 IST

30న ‘ప్రజా గర్జన’కు భారీ ఏర్పాట్లు

ఈనాడు, విశాఖపట్నం: మరో మాట లేకుండా...ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అలుపెరగని ఉద్యమాలతో...ఆ ప్రయత్నాన్ని ఆపుతామని కార్మికులు, ఉద్యోగులు పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్కు పరిరక్షణకు చేపట్టిన ఉద్యమం గడచిన రెండేళ్లలో తీవ్ర రూపం దాల్చింది. కర్మాగారంలోని పలు కార్మిక సంఘాలు, మూడు అసోసియేషన్లు, నిర్వాసిత సంఘాలు ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’గా ఏర్పడి.. నాటి నుంచి  పోరాటం చేస్తూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఉక్కు కర్మాగారంలోని త్రిష్ణా మైదానంలో ‘ఉక్కు ప్రజా గర్జన’ పేరిట భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తీసుకువచ్చేందుకు కార్మిక సంఘాలు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల ఆస్తి అని, దానిని రక్షించుకోవడానికి చేస్తున్న ఉద్యమంలో సామాన్యులు కూడా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. భాజపా మినహా అన్ని పార్టీల నుంచి కీలక నాయకులను ఆహ్వానించారు.

* విశాఖ ఉక్కులో వాటాలను వందశాతం ఉపసంహరిస్తున్నట్లు 2021 జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత ఫిబ్రవరి మొదటివారం నుంచి భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి రోజురోజుకు ఉద్ధృత రూపం దాలుస్తున్నాయి. కేంద్ర మంత్రులు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వారిని ఉక్కు కర్మాగారం ఎదుట ఉన్న  రహదారిపై కాకుండా మరో మార్గంలో పోలీసులు పంపుతున్నారంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

* 2021 ఫిబ్రవరి ఐదో తేదీన కర్మాగారం నుంచి నగరం వరకు వేలాది ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బ్లాక్‌ డే’, ‘ఉక్కు కార్మిక గర్జన’, విశాఖ బీచ్‌లో ‘కార్మిక, రైతు శంఖారావం’, అగనంపూడి నుంచి విమానాశ్రయం వరకు 11 కి.మీ.ల మేర భారీ మానవహారం, కర్మాగార ప్రాంగణంలో వంటావార్పూ తదితర కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించగా విజయవంతం అయ్యాయి. అయినప్పటికీ కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మరో వైపు గతంలో చెప్పినట్లు తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే తమ భూములు తిరిగి ఇచ్చేయాలని నిర్వాసితులు డిమాండు చేస్తున్నారు.

విశాఖ ఆర్థిక రంగంపై ప్రభావం: ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పటి వరకు సంస్థ    పన్నులు, డివిడెండ్ల రూపంలో రూ.50 వేల కోట్లు చెల్లించింది. కర్మాగారం విలువ హీనపక్షం రూ.3లక్షల కోట్లకు పైగానే ఉంటుందని ఓ అంచనా. ఈ కర్మాగారాన్ని విక్రయిస్తే ఉద్యోగులకే కాదు... స్థానిక వ్యాపారులకు, నిరుద్యోగులకు కూడా తీవ్రమైన నష్టం కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు. సంస్థ ప్రతి నెలా చెల్లించే రూ.250 కోట్ల జీతాల కారణంగా విశాఖ నగర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఉద్యోగులు, కార్మికుల కొనుగోలుశక్తి పెరగడంతో ఎన్నో సంస్థలు ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించాయి. పరిస్థితి తారుమారైతే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన తరువాత కర్మాగారంలో కొన్ని ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి కూడా నియామకాలు నిలిపివేశారు.  రేపటి సభలో ఈ పరిస్థితులన్నీ మరోసారి ప్రజల ముందుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పోరాట కమిటీ నేతలు శ్రమిస్తున్నారు.


నేడు హరియాణా గవర్నర్‌ రాక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీ నుంచి విమానంలో బయల్దేరి సాయంత్రం 5.10 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ్నుంచి పిఠాపురంకాలనీ చేరుకుని.. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత వాల్తేరు అప్‌ ల్యాండ్స్‌లోని ఎంవీవీ రాయల్‌ ప్యాలెస్‌ చేరుకుని రాత్రి భోజనం చేస్తారు. రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి వెళతారు. 30న ఉదయం 10.30 గంటలకు చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీతమ్మధార చేరుకుని మధ్యాహ్నం భోజనం చేస్తారు. మూడు గంటలకు  శంకరమఠం చేరుకుని శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కలుస్తారు. సాయంత్రం 4.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని .. తరువాత దిల్లీకి ప్రయాణమవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు