logo

ఆచార్య రాధాకృష్ణ విశ్లేషణ అపూర్వం

ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా, ‘జాతీయ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ ఛైర్మన్‌గా, ఐ.సి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చ్‌) సభ్య కార్యదర్శిగా, ఐ.జి.ఐ.డి.ఆర్‌.

Published : 29 Jan 2023 05:29 IST

భారత మాజీ రాయబారి ఎస్‌.ఆర్‌.హషీమ్‌

ప్రసంగిస్తున్న భారత మాజీ రాయబారి ఎస్‌.ఆర్‌.హషీమ్‌

ఈనాడు, విశాఖపట్నం:  ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా, ‘జాతీయ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ ఛైర్మన్‌గా, ఐ.సి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చ్‌) సభ్య కార్యదర్శిగా, ఐ.జి.ఐ.డి.ఆర్‌.(ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన దివంగత ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల్లో ఒకరని కజికిస్థాన్‌లో పని చేసిన  భారత మాజీ రాయబారి ఎస్‌.ఆర్‌.హషీమ్‌ పేర్కొన్నారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘ఆచార్య రొక్కం రాధాకృష్ణ స్మారకోపన్యాసం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదలు, రైతుల ఇబ్బందులను ఆయన అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి పలు పరిష్కారాలను సూచించారని పేర్కొన్నారు. పేదల ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, తగిన పోషక విలువలున్న ఆహారాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అది చాలా కీలకమైన విషయమని గుర్తుచేశారు. పేదరికంపై కేంద్రం నియమించిన పి.వి.లక్డావాలా కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరించి పలు కీలక సిఫార్సులు చేశారన్నారు. పేదరికం, అసమానతలు, పేదల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఆయన విశ్లేషించిన తీరు, అర్థం చెప్పిన విధానంపై పుస్తకాన్ని రాసి ఆయనకు ఇవ్వాలని భావించానన్నారు. ఆయన  అకస్మాత్తుగా మరణించడంతో స్మారకోపన్యాసంలో ప్రసంగిస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగం బలోపేతం కావడానికి, సెస్‌ (సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌) విభాగానికి అవసరమైన కీలక రచనలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ఆంధ్రప్రదేశ్‌’ (ఐడీఎస్‌ఏపీ) ఛైర్మన్‌ ఆచార్య ఎస్‌.మహేంద్రదేవ్‌, డైరెక్టర్‌ ఆచార్య గలాబ్‌, రిజిస్ట్రార్‌ ఇ.నాగభూషణరావు, ఆర్‌.బి.ఐ. మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని