logo

విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి

విధులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ పరిధి సామయ్యవలసలో చోటుచేసుకుంది.

Published : 29 Jan 2023 05:29 IST

పద్మనాభం, న్యూస్‌టుడే: విధులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ పరిధి సామయ్యవలసలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెందిన సగిలాడ కనకరాజు(39) సామయ్యవలస గ్రామానికి చెందిన బూర్లె అప్పలనాయుడుకు చెందిన ఇళ్ల నిర్మాణ పనికి వచ్చాడు. శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో పరంజీపై నిలబడి ఎలివేషన్‌ పనులు చేస్తుండగా అనుకోకుండా పక్కనే ఉన్న విద్యుత్తు తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం తగరపువలసలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య పైడిరాజు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీఐ ఎన్‌.సన్యాసినాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


తల్లీ కూతుళ్ల అదృశ్యం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మానసిక ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన తల్లీ కూతుళ్లు అదృశ్యమైన సంఘటన విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మణికుమారి మానసిక సమస్యతో బాధపడుతుండగా ఆమె తల్లి ధనలక్ష్మీ గత ఏడాది అక్టోబర్‌లో విశాఖ మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం పూర్తయిన తరువాత నవంబర్‌లో ఆమెను డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ ఇంటికి వెళ్లలేదు. మణికుమారిని చూడ్డానికి ఆమె సోదరుడు  అమలాపురం నుంచి వచ్చారు. ఆసుపత్రి నుంచి నవంబరులోనే డిశ్చార్జి జరిగినట్లు ఉండటం.. ఇంటికి కూడా రాకపోవడంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో హెచ్‌.సి. ప్రభాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జూదరుల అరెస్టు

గురుద్వారా, న్యూస్‌టుడే: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జూదం ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రెండు లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని