logo

ప్రజాధన దుర్వినియోగ నిర్ణయాలను అడ్డుకుంటాం: తెదేపా

పూర్ణమార్కెట్‌, ముడసర్లోవ పార్కు స్థలాల ప్రైవేటీకరణపై జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని తెదేపా కార్పొరేటర్ల సమావేశం నిర్ణయించింది.

Published : 31 Jan 2023 04:47 IST

మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు, చిత్రంలో వెలగపూడి, పీలా, గండి బాబ్జీ తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పూర్ణమార్కెట్‌, ముడసర్లోవ పార్కు స్థలాల ప్రైవేటీకరణపై జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని తెదేపా కార్పొరేటర్ల సమావేశం నిర్ణయించింది. ఫిబ్రవరి 1న జరగనున్న ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చించారు. అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని, ప్రైవేటీకరణ ముసుగులో విలువైన స్థలాలను వైకాపా నాయకులకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పార్టీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచించారు. సమావేశ తీర్మాలను తెదేపా ఫ్లోర్‌లీడరు పీలా శ్రీనివాసరావు వెల్లడించారు.

* జీ-20 సదస్సు పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పాలక వర్గం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. పూర్ణమార్కెట్‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే అంశాన్ని కౌన్సిల్‌ అజెండాలో ప్రతిపాదించారని, దీని వల్ల వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ముడసర్లోవ పార్కు స్థలాన్ని పీపీపీ పద్ధతిలో థీమ్‌పార్కులా అభివృద్ధి చేసే అజెండా వెనుక విజయసాయిరెడ్డికి ధారాదత్తం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో రూ.కోట్ల విలువ చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రతిపాదనలను అజెండాలో పెట్టారన్నారు.

* జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి నెలకు రూ.2కోట్లను క్లాప్‌ వాహనాల యజమానులకు చెల్లిస్తున్నారని, చెత్త వాహనాలకు రంగులు వేయడానికి రూ.87లక్షలు, ఉద్యాన విభాగ పొరుగుసేవల సిబ్బందికి ఒకేసారి రూ.15వేల వేతనం పెంపు, రూ.20కోట్లతో జాతీయ రహదారిలో ఫెన్సింగ్‌ ఏర్పాటు, కమిషనర్‌, మేయర్‌లకు రూ.75లక్షలతో కొత్త వాహనాల కొనుగోలు చేసే నిర్ణయాలను అడ్డుకుంటామని పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ నియోజకవర్గ బాధ్యులు గండి బాబ్జీ, ఉప ఫ్లోరులీడరు గంధం శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని