logo

విద్యార్థుల మేధా‘శక్తి’

పెట్రోల్‌, డీజిల్‌తో కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చినవే ఎలక్ట్రిక్‌ వాహనాలు. అవి ఆగకుండా నడవవాలంటే ఛార్జింగ్‌ కేంద్రాలు తప్పనిసరి.

Published : 31 Jan 2023 04:47 IST

ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌కు వినూత్న ఆలోచన

ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థినులు

విశాఖపట్నం, సింధియా, న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌తో కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చినవే ఎలక్ట్రిక్‌ వాహనాలు. అవి ఆగకుండా నడవవాలంటే ఛార్జింగ్‌ కేంద్రాలు తప్పనిసరి. అయితే...ఎలాంటి ఛార్జింగ్‌ కేంద్రాలు అవసరం లేకుండా ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే అవి ఛార్జ్‌ అయ్యేలా విద్యార్థులు తమ ఆలోచనకు ప్రాథమికంగా ఆచరణ రూపం ఇచ్చారు. వారే... బోడే అనీషా ప్రగ్న, చొప్పా జ్ఞానేశ్వరి, బాత్తి భువనేశ్వరి. వీరు శ్రీహరిపురంలోని మిసెస్‌ మరియదాస్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అనీషా ప్రగ్న తన కుటుంబ సభ్యులతో ఒకసారి ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణిస్తున్నపుడు అది మధ్యలో ఆగి  ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచనను స్నేహితులతో పంచుకున్నారు. తరువాత సైన్స్‌ ఉపాధ్యాయురాలు సుజాత సూచనలతో ‘వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ యూసింగ్‌ వైర్‌లెస్‌ పవర్‌ ట్రాన్స్‌ఫర్‌ ’ అనే ప్రాజెక్టును రూపొందించారు.  ఎలాంటి తీగల సహాయం లేకుండా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఛార్జింగ్‌ అయ్యేలా, ప్రయాణం మధ్యలో ఆగాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందంటున్నారు. ఎలక్ట్రిక్‌ కారు, బస్సు, స్కూటీ అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇది ఉపయోగడుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు 2022-23 సంవత్సరం ‘ది మ్యాక్‌మిలన్‌ బడ్డింగ్‌ సైంటిస్టు అవార్డు ’కు ఎన్నికైంది. ఇందులో దక్షిణాది నుంచి 4వేలకు పైగా ప్రాజెక్టులు నామినేషన్లలో పాల్గొనగా ఆంధ్రపదేశ్‌ నుంచి ఈ ప్రాజెక్టు ఎన్నికైందని, ఫిబ్రవరి 17, 18న ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో జరిగే రెండో స్థాయి పోటీల్లో  పాల్గొననున్నట్లు విద్యార్థులు వివరించారు.

రోడ్డు మీద అమర్చే అయస్కాంత ప్రేరణ శక్తి పరికరాల నమూనా

పనితీరు ఇలా: ‘అయస్కాంత ప్రేరణ శక్తి కలిగిన పరికరాలను రోడ్డు మీద, ఎలక్ట్రిక్‌ వాహనానికి అడుగు భాగంలో బిగించాలి. రోడ్డుపై అమర్చే పరికరాన్ని ట్రాన్స్‌మీటర్‌ అంటారు. ఎలక్ట్రిక్‌ వాహనం అడుగు భాగంలోని పరికరాన్ని రిసీవర్‌ అంటారు. రహదారిపై వీటిని నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాలి. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌ మధ్య జరిగే చర్యతో ఎ.సి. విద్యుత్తు డి.సి. విద్యుత్తుగా మారుతుంది. అలా మారిన సందర్భంలోనే వాహనాలు వాటంతట అవే ఛార్జ్‌ అవుతాయి. ఎలాంటి తీగలు ఉపయోగించకుండానే ఈ పరికరాలు పనిచేస్తాయి’ అని తమ ప్రాజెక్టు తీరును వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని