logo

ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం.. ఒకరి ఆచూకీ లభ్యం

జగదాంబకూడలి దరి యల్లమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపింది.

Published : 31 Jan 2023 04:21 IST

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: జగదాంబకూడలి దరి యల్లమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న వీరు ప్రతిరోజు 8.30 గంటలకు పాఠశాలకు వచ్చి, సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు వెళ్లిపోయేవారు. సోమవారం సాయంత్రం 6 గంటలు దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు వెళ్లారు. సిబ్బందిని అడగగా, స్కూల్లో ఎవరూ లేరని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఆర్టీసీ, రైల్వేస్టేషన్‌, బీచ్‌రోడ్డు, పాతనగరం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఇంతలో ఒక బాలిక రాత్రి 10.30గంటల సమయంలో జగదాంబకూడలి వద్ద ఉండగా పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినట్లు తెలిపింది. సహ విద్యార్థిని గురించి అడగ్గా ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. అయితే ఆ బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. తల్లిదండ్రులు కొడతారనే భయంతో ఆమె ఎక్కడైనా ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని