logo

నిర్దేశిత విధానంలో బోధించకుంటే చర్యలు

విద్యాశాఖ నిర్దేశించిన విధానంలో బోధించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు (ఆర్‌జేడీ) ఎం.జ్యోతికుమారి హెచ్చరించారు. అచ్యుతాపురం ఉన్నత పాఠశాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు.

Published : 31 Jan 2023 04:47 IST

ఆర్‌జేడీ జ్యోతికుమారి
అచ్యుతాపురం, పూడిమడకలో 11 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌  

అచ్యుతాపురంలో చిన్నారుల రాతపుస్తకాలను తనిఖీ చేస్తున్న ఆర్‌జేడీ జ్యోతికుమారి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: విద్యాశాఖ నిర్దేశించిన విధానంలో బోధించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు (ఆర్‌జేడీ) ఎం.జ్యోతికుమారి హెచ్చరించారు. అచ్యుతాపురం ఉన్నత పాఠశాలను ఆమె సోమవారం తనిఖీ చేశారు. పూడిమడక ఉన్నత పాఠశాలను ఎలమంచిలి ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్‌ తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, రాత పుస్తకాలు దిద్దకపోవడం, విద్యార్థులకు తక్కువ గ్రేడింగ్‌ ఇవ్వడం, లెసన్‌ ప్లాన్లు రాయకపోవడం, అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సక్రమంగా సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో పూడిమడకలో ప్రధానోపాధ్యాయినితోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు, అచ్యుతాపురంలో మరో ఐదుగురు కలిపి మొత్తం 11 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

* రోజుకు 8 పిరియడ్లతోపాటు ట్యాబ్‌ల ద్వారా పాఠాలు చెబుతూ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నా ప్రభుత్వం తమను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. లెసన్‌ ప్లాన్లు రాయడానికి, విద్యార్థుల రాత పుస్తకాలను దిద్దడానికి పాఠశాల పనివేళల్లో సమయం ఎక్కడ లభిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు అమలు చేయడం వీలుకాదని ప్రభుత్వానికి తెలిసినా మొండిగా కక్షసాధింపుతో ముందుకెళ్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.


ప్రధానోపాధ్యాయుడిపై వేటు..
నలుగురు ఉపాధ్యాయులకు నోటీసులు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని కె.హెచ్‌.వాడ ప్రధానోపాధ్యాయుడు సుందర్రావును సస్పెండ్‌ చేస్తూ డీఈఓ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్‌ ఈ నెల 10న పాఠశాలను తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు విధులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గుర్తించారు. ఆయనతోపాటు ఉపాధ్యాయులు పి.శ్రీను, పద్మావతి, కుమార్‌, రమణరాజుకు నోటీసులు జారీ చేశారు. వీరంతా పాఠ్యాంశాల ప్రణాళికలు, డైరీలు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈఓ నివేదిక మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని మండల విద్యాశాఖాధికారి కె.ఎన్‌.గాంధీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని